గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కు జరుగుతున్న ఎన్నికల్లో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకు సాగడం భారతీయ జనతా పార్టీకి ఒక తప్పనిసరి అవసరం! పవన్ కళ్యాణ్ ను విస్మరించినట్లయితే… బల్దియాలో పాగా వేసి మేయర్ పీఠం దక్కించుకుని తమ ప్రభను నిరూపించుకోవాలని ఆశిస్తున్న, తద్వారా తెలంగాణ బీజేపీ హవా అనల్పంగా పెరుగుతున్నట్లుగా ప్రజల్లోకి సంకేతాలు పంపాలని ఉవ్విళ్లూరుతున్న పార్టీకి ఆశాభంగం తప్పకపోవచ్చు. జనసేన ప్రస్తుతానికి జంటనగరాలలో సొంతంగా మెజారిటీ సీట్లను సాధించేంత బలమైన పార్టీ కాకపోవచ్చు కానీ, భారతీయ జనతా పార్టీ పవన్‌కు ఉన్న ప్రజాదరణను చిన్నచూపు చూస్తే మాత్రం ఎదురుదెబ్బ తినక తప్పదు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన- కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామి పార్టీ! ఆ పొత్తు ధర్మాన్ని గౌరవించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. తెలంగాణలో జిహెచ్ఎంసి మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని ఆశిస్తున్న నేపథ్యంలో తమ అమ్ములపొదిలో ఉన్న ఏ ఒక్క అస్త్రాన్ని కూడా వృథా చేసుకోకుండా సద్వినియోగపరచుకోవడం భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోవాల్సిన ప్రధాన కర్తవ్యం ఆ సంగతి వారు విస్మరించి సీట్లు పంచుకోవడంలో జనసేనను పట్టించుకోకపోతే నష్టపోతారు.
ఇవీ చదవండి : రెండేళ్లు వెయిట్ చేయాలా.. గుస్సా అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ బీజేపీని చూసి కంగారు పడుతున్న టీఆర్ఎస్ నాయకులు కొవిడ్ భయం ఉందా.. మీకిదే శుభవార్త! అయోధ్య నగరం ఓ అద్భుతాన్ని నమోదు చేసింది..
జిహెచ్ఎంసి ఎన్నికలలో జనసేన పార్టీ తెలంగాణలో అరంగేట్రం చేస్తుందనే అభిప్రాయం, చేయాలని అనుకుంటున్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. దానికి తగినట్లే రెండు రోజుల కిందట ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఈసారి బరిలో ఉంటారని జనసేన తెలంగాణ విభాగం నాయకుడు శంకర్ గౌడ్ ఒక ప్రకటన చేశారు. పార్టీ కార్యాలయంలో సమావేశం పెట్టుకుని శ్రేణులకు ఆ మాట చెప్పారు. మరురోజున పవన్ కళ్యాణ్ స్వయంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికలలో తాము పోటీ చేయబోతున్నాడు అని ప్రకటించారు. ఈలోగా బీజేపీ తాము ఒంటరిగానే ఈ బరిలో ఉంటామని, ఎవరితోనూ పొత్తులు లేవని తేల్చేసింది.
బీహార్ విజయం వారికి పాఠం నేర్పలేదా?
బీహార్ లో బీజేపీ ఒక అద్భుతమైన గేమ్ ప్లాన్ చేసింది. ఎన్డీయే భాగస్వామి ఎల్జేపీ కూటమినుంచి బయటకు వచ్చి బరిలో దిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బాగా చీల్చింది. విపక్షాలకు గంపగుత్తగా పడవలసిన ఓట్లు చీలిపోయాయి. కేవలం 0.5 శాతం ఓట్ల తేడాతో విపక్షాలు ఓడిపోయాయి. ఎక్కడైనా సరే.. రాజకీయ వ్యూహం ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ అధికారపార్టీ టీఆర్ఎస్. విపక్షాలు విడివిడిగా పోటీచేస్తే.. టీఆర్ఎస్‌కే లాభం.
బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బల్దియాను దక్కించుకోవాలని చూస్తోంది. జాతీయ స్థాయి వ్యూహచతురులైన నాయకులు అనేక మంది ఇక్కడకు వచ్చి తిష్టవేయడం, కాంగ్రెస్ నుంచి వరుస ఫిరాయింపులు పెరగడం, అభ్యర్థుల విషయంలో దూకుడు ఇవన్నీ దీనినే ప్రతిబింబిస్తున్నాయి. ఇలాంటప్పుడు జనసేన బరిలోకి దిగడం వలన ఒక్క శాతం ఓట్లు చీలినా సరే, బీజేపీకి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. దాని బదులు.. వారితో పొత్తు పెట్టుకుని.. కొన్ని సీట్లను కేటాయిస్తే పవన్ కల్యాణ్ తో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రచారం చేయించుకునే అవకాశం ఉంటుంది. కనీసం రెండు మూడు చోట్ల రోడ్ షోలు నిర్వహించినా.. పవన్ కున్న ప్రజాదరణ కూడా కలిసి వస్తుంది. అన్నింటినీ మించి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. ఇసుమంతైన చీలిపోకుండా వారు రాబట్టుకోగలుగుతారు.
అలా వ్యూహాత్మకంగా వెళ్లకుండా.. తెలంగాణలో తమ హవా బాగానే ఉన్నది కదాని అనుకుని, ఏదో సీట్ల కోసం కక్కుర్తి పడి.. పవన్ కల్యాణ్ ను ఏపీలో మాత్రం వాడుకుందాం అని అనుకుంటే.. ఇక్కడ పక్కన పెడితే.. బీజేపీ ఖచ్చితంగా దెబ్బతింటుంది.
.