పల్నాడు జిల్లా అంటేనే ముఠాతగాదాలకు పెట్టింది పేరు. ఈ కోణంలో గమనించినప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గం కూడా ఎంతో సునిశితమైన ప్రాంతంగా పోలీసులు గుర్తిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో పర్యటన పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం ప్రతిపక్ష నేతకు కూడా అవసరమే. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం అనేది ప్రభుత్వం యొక్క విధి అని ఏవిధంగా అయితే వేలెత్తిచూపగలమో.. అదే విధంగా.. అలా శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించడం అనేది ప్రతిపక్ష నేతకు కూడా బాధ్యత అని తెలుసుకోవాలి. కానీ.. జగన్ రెంటపాళ్ల పరామర్శ యాత్ర అనేది తన బాధ్యతను తెలుసుకున్న నాయకుడి వ్యవహారం లాగా జరగలేదు. పోలీసులను, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యం అన్నట్టుగా సాగింది.
పార్టీ కార్యకర్త తెలుగుదేశం వారి వేధింపులవల్లే చనిపోయినట్టుగా జగన్ చెబుతున్నది నిజమే అనుకున్నప్పటికీ కూడా.. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న ఏడాది వరకు ఆ కుటుంబం కన్నీళ్లు తుడవడానికి జగన్ కు టైం లేకుండా పోయిందా అనేది పెద్ద ప్రశ్న. అప్పట్లో కూడా ఒకసారి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే పార్టీకి ఇంకా ఎంతో గౌరవంగా ఉండేది. మొత్తానికి ఆయన పర్యటన పెట్టుకున్న తర్వాత.. పోలీసులు అనుమతుల విషయంలో వ్యవహరించిన తీరు కూడా అభ్యంతరకరమే. ఆయన కాన్వాయ్ తప్ప మూడు వాహనాలకు మించి రావడానికి వీల్లేదని, మొత్తం కార్యక్రమంలో వంద మందికి మించి హాజరు కావడానికి వీల్లేదని అనడం ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టే నిర్ణయం.
జగన్ రెచ్చిపోయినందుకు నిదర్శనమే అంత ఆర్భాటంగా రోడ్ షోలాగా రెంటపాళ్లకు వెళ్లడం. మీ అనుమతులను నేను పట్టించుకోను.. ఏం చేస్తారో చేసుకోండి.. అని తద్వారా జగన్ పోలీసులకు, ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు ఇవ్వదలచుకున్నారు. రెచ్చగొట్టేలాగా తన ర్యాలీ నిర్వహించారు. కానీ ఈ పరిణామాలు మంచిది కాదు. జగన్ పరామర్శకు వెళ్లదలచుకున్నప్పుడు.. అనుమతుల విషయంలో పోలీసులు ఇంకొంచెం వెసులుబాటు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండకపోయేది. ఉభయులూ రాజకీయ విబేదాల్ని కక్షలకు, ప్రతీకారాలకు వేదికగా మార్చుకుంటున్న ధోరణులు ప్రమాదకరం.
Discussion about this post