సొంత అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డితో, ఆయన చెల్లెలు షర్మిల విభేదించిందో లేదో ఎవ్వరికీ తెలియదు. కాకపోతే.. తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర చూపించేలా, వైఎస్సార్ పాలన వైభవం తిరిగి తీసుకురావడం లక్ష్యం అంటూ వైఎస్సార్ టీపీ ప్రారంభించింది. కేసీఆర్ పాలన మీద అలుపెరగని విమర్శలతో ఆమె ప్రస్థానం సాగిస్తోంది. క్రమంగా అధికార పార్టీకి పక్కలో బల్లెంలా మారుతోంది.
ఈ నేపథ్యంలో షర్మిల పార్టీలోకి త్వరలోనే కొందరు కీలకమైన నేతలు చేరబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ తెరాసలో ఉన్నవారు, షర్మిల మీద నమ్మకం కావొచ్చు, వైఎస్సార్ మీద అభిమానం కావచ్చు.. కారణం ఏదైనా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరబోతున్నారని సమాచారం. చిన్న నాయకుడు అయినా సరే.. అధికార పార్టీని వీడి షర్మిల మీద నమ్మకంతో ఆమె పార్టీలో చేరితో గనుక.. అది ఆమె పార్టీకి చాలా నైతిక బలం ఇచ్చే అంశం అవుతుంది.
తాజాగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. తెరాసకు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గట్టు రాంచందర్ రావు వైఎస్సార్ టీపీలో చేరుతారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గట్టు రాంచందర్ రావు రాజశేఖరరెడ్డి అనుయాయుల్లో ఒకరు. వైసీపీని స్థాపించిన తర్వాత.. ఆయన పూర్తిగా జగన్ నే నమ్ముకుని ఉన్నారు. జగన్మోహన రెడ్డి ఎవరి మీద విమర్శలు చేయాల్సి వచ్చినా సరే- అందరికంటె ముందుగా ప్రెస్ మీట్ లు పెట్టి.. తూర్పార పట్టడానికి గట్టు రాంచందర్ రావు నిత్యం అందుబాటులో ఉండేవాడు. ఎప్పుడూ పార్టీ ఆఫీసులోనే ఉంటూ.. అంకితభావం గల కార్యకర్తలాగా జగన్ కు సుదీర్ఘకాలం సేవలందించాడు.
కాలక్రమంలో జగన్ పూర్తిగా సమైక్యాంధ్ర వాదానికి కట్టుబడడం, ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం కావడం నేపథ్యంలో గట్టు- వైసీపీని వీడి తెరాస తీర్థం పుచ్చుకున్నాడు. తన సీనియారిటీకి మర్యాద ఇచ్చి ఏదో పదవి కట్టబెడతారని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇన్నాళ్లుగా దక్కిందేమీ లేదు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి హామీ కేసీఆర్ నుంచి ఉండేది. తాజాగా 12 మంది ఎమ్మెల్సీలను మండలికి పంపబోతున్న నేపథ్యంలో .. ఈ దఫా కూడా తనకు అవకాశం రాకపోయే సరికి గట్టు రాంచందర్ రావు అలక పూనారు. ఏకంగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేశారు.
భవిష్యత్ కార్యాచరణ గురించి ఆయన ఇంకా ప్రకటించలేదు గానీ.. వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా షర్మిల పార్టీలో చేరుతారనేది విశ్వసనీయ సమాచారం. షర్మిలకు కూడా ప్రస్తుతానికి ఆమె పార్టీలో పేరున్న నాయకులు ఎవరూ లేరు. ఆమె తప్ప కేసీఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధించడానికి తగిన మరో నాయకుడు కూడా లేరు. గట్టు ఆ లోటును చాలా చక్కగా భర్తీ చేయగలరు. త్వరలోనే గట్టు రాంచందర్ రావు వైఎస్సార్ టీపీలో చేరడం జరుగుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Discussion about this post