కాలేజీలో అమ్మాయిని చూసి మోహంలో పడిపోయిన తర్వాత.. ఆ మోహాన్ని ఆమెకు తెలియజేసేది ఎలాగ? తెలియజేసే వరకు లోలోపల ఎంత తపన ఉంటుంది? ఎంత మధనం ఉంటుంది? అది ఎలా బయటకు వస్తుంది..?
లోపలి భావోద్వేగాన్ని అణచుకుని, భావావేశాన్నంతా రంగరించుకుని.. అక్షరాల్లో దానినికూర్చి.. కాగితమ్మీదికి తర్జుమా చేసి ముత్యాల్లాంటి అక్షరాల్లో దానిని ప్రవహింపజేసి.. ఇంతా చేస్తే.. అది ప్రేమలేఖ! ఇప్పుడది ఎక్కడ కనిపిస్తోంది?
ప్రేమలేఖ రాయడం అంటేనే ఒక యజ్ఞం. ఎన్ని కాగితాలను చించి పోగులు పెట్టాలో.. రంగురంగుల్లో మెరిసిపోయేవి.. సువాసనలు వెదజల్లేవి.. ఎన్ని రకాల కాగితాల్ని ప్రత్యేకంగా దానికోసం కొనుగోలు చేయాలో? వాటిని చించి పోగులు పెడుతూ.. ఎన్ని రాత్రులు గడపాలో..? అలా చిట్టిచివరికి ప్రేమలేఖ తయారైతే.. దాన్ని మనం వలచిన అమ్మాయికి అందజేయడం మరో ఎత్తు!
పుస్తకాల్లో దాచి, ఆ పుస్తకాన్ని ఆ అమ్మాయికి చేరవేయాలా? ఆమెకు స్నేహితురాలైన మరో అమ్మాయిని హఠాత్తుగా చెల్లెలిగా చేసుకుని ఆమె ద్వారా అందజేయాలా? ఆ అమ్మాయికి తమ్ముడు ఉంటే.. వాడిని కాకాపట్టి, చాక్లెట్లు ఐస్ క్రీం కొనిపెట్టి వాడిద్వారా దానిని అక్కయ్యకు పంపాలో.. ఇవన్నీ ప్రయాసలే.
అయితే ఇవన్నీ కూడా నిన్నటితరం ప్రేమలేఖ ప్రయాసలు.
మరి ఇవాళ్టి తరం ఎలా ఉంది?
ఒక అమ్మాయి కంటికి నచ్చిందా? కెన్ వియ్ గో ఫర్ ఏ డేట్, షల్ వియ్ హేవ్ ఏ డేట్ అని అడిగామా.. ఒప్పుకుందా.. కలిసి తిరిగామా.. ఒప్పుకోలేదా లైట్ తీసుకున్నామా..? ఇంతే ఈ ఫటాఫట్ జెనరేషన్ లో ప్రేమ వ్యవహారం అటో ఇటో అంతా నిమిషాలు, మహా అయితే గంటల్లోనే తేలిపోతోంది.
ఈ జెనరేషన్ కుర్రాళ్లకు ప్రేమలేఖ ఎపిసోడ్ కనెక్ట్ అవుతుందా? వారికి రుచి తెలియని ఒక రకం అనుభూతులను గుర్తుకు తెస్తే బాగానే కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా.. ఈ లేఖ రాయడమూ.. ఇవ్వడమూ కామెడీగా ఉందేంట్రా బాబూ అనిపిస్తే ఢమాల్ అంటుంది.
మరి ‘ప్రేమలేఖ’ ఈ జెనరేషన్ కు కనెక్ట్ అవుతుందో లేదో.. ఇవాళ విడుదల కాబోతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తేలుస్తోంది.
ఈ సినిమా విడుదల నేపథ్యంలో సినిమా ముచ్చట్లను మీడియాతో పంచుకున్న అఖిల్.. దీనిని రొమాంటిక్ మూవీగా అభివర్ణిస్తూ ప్రేయసి లేఖ రాయడమూ, పువ్వు ఇవ్వడమూ రొమాన్సే అంటూ నిర్వచనం చెప్పారు. అవే రొమాన్స్ అనుకుంటూ.. దీనిని రొమాంటిక్ మూవీగా భావిస్తే గనుక.. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ నిన్నటితరం రొమాంటిక్ మూవీని చేసినట్టుగా అనుకోవాలి. ఈ సినిమాలో విభావరి అనే ముద్దుగుమ్మ పాత్రలో పూజా హెగ్డేతో హర్ష అనే అఖిల్ ప్రేమలో పడతాడు. కాకపోతే లేఖలు, పువ్వుల ద్వారా వాటిని ఎక్స్ ప్రెస్ చేస్తాడు. అలా పాతతరం పద్ధతుల్ని ప్రేమ వ్యక్తీకరణకు ఎంచుకుంటే.. స్క్రిప్టు ప్రకారం హీరోయిన్ని మెప్పిస్తాడేమో గానీ.. ఆడియన్సుని మెప్పించగలడా అనేది ప్రశ్న.
నిన్నటితరం హృద్యమైన కథల్ని ఇవాళ్టి తరానికి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో నేర్పు ఉన్న బొమ్మరిల్లు భాస్కర్.. ఈ చిత్రాన్ని ఎలా తీర్చారో చూడాలి!
.