అసలు దావూద్ ఇబ్రహీం ముంబయిని అడ్డాగా చేసుకుని మాఫియారాజ్యం ఏలాడు. ముంబయిని వీడిపోవాల్సి వచ్చినప్పుడు దుబాయిని అడ్డాగా చేసుకుని ముంబయి మాఫియా రాజ్యాన్ని శాసించాడు. కానీ ఈ తెలుగు దావూద్ వేరు. హైదరాబాదును అడ్డాగా చేసుకుని.. దావూద్ ఇబ్రహీంనే తనకు రోల్ మోడల్ గా ఎంచుకుని.. అదే తరహాలో చెలరేగిపోయిన వ్యక్తి గ్యాంగ్‌స్టర్ నయీమ్.
నయీమ్ అంటే.. గ్యాంగ్స్టర్ గా మారిన మాజీ నక్సలైటుగానే మనందరికీ తెలుసు. కిడ్నాపులు, కిరాయిహత్యలకు పేరుమోసిన డాన్ గా కూడా తెలుసు. మనకు తెలిసిన నయీమ్ గురించి.. తెలియని అనేక సంగతులతో కలిపి ‘నయీమ్ డైరీస్’ సినిమా తయారవుతోంది. మరో మాజీ నక్సలైటు దామూ బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. దామూ బాలాజీ ఆదర్శిని డాట్ కామ్ తో నయీమ్ గురించి చేసిన తన పరిశోధనలోంచి పంచుకున్న ఒక ముచ్చట ఇది.
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ను చూడగానే.. తటాల్న మనకు దావూద్ ఇబ్రహీం గుర్తుకు వస్తాడు. దావూద్ తరహాలోనే నయీమ్ కూడా కొంత బొద్దుగా ఉండే మాట వాస్తవమే. కానీ అదొక్కటే కారణం కాదు. అచ్చంగా దావూద్ నే పోలిఉండే నయీమ్ వస్త్రధారణ కూడా ఒక కారణం. ఇద్దరూ ఒకే తరహా వస్త్రధారణతో ఉండడం అనేది యాదృచ్ఛికం ఎంతమాత్రమూ కాదు.
నయీమ్‌కు దావూద్ అంటే అపరిమితమైన భక్తి. ఇష్టం. అతనే తన రోల్ మోడల్ అనుకునేవాడు. అందుకే.. డ్రస్సింగ్ స్టైల్ మొత్తం దావూద్ నే ఇమిటేట్ చేసేవాడు. దావూద్ ఇబ్రహీం లాగా చాలా పెద్ద డాన్ అవ్వాలనేది అతని కోరిక.
దావూద్ ఇబ్రహీం అంటే నయీమ్ కు ఈ ఇష్టం గ్యాంగ్‌స్టర్ అవతారం ఎత్తిన తర్వాత హఠాత్తుగా పుట్టినది కాదు. నక్సలైటుగా అరెస్టు అయి జైల్లో ఉన్నప్పుడు కూడా దావూద్ పట్ల ఉండే ఇష్టాన్ని తన సహచరులందరితోనూ చెప్పేవాడు. డ్రస్సింగ్ లో కూడా దావూద్ నే అనుకరించేవాడు.
దావూద్ అంత స్థాయిలో కాకపోయినా అదే తరహాలోనే.. హైదరాబాదు అడ్డాగా మాఫియా నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకుని నడిపించాడు గానీ.. పోలీసు ఎన్ కౌంటర్ లో అంతమైపోయాడు.
నయీమ్ జీవితం కథగా రూపొందుతున్న ‘నయీమ్ డైరీస్’ చిత్రంలో.. వశిష్ట సింహా హీరో. నారప్పలో నెగటివ్ రోల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వశిష్ట సింహా.. మరోసారి మెప్పించబోతున్నాడు. వరదరాజు ఈ చిత్రానికి నిర్మాత. దామూ బాలాజీ దర్శకత్వంలో తయారైన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబైంది.
.

Discussion about this post