అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని సంకల్పించి, న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజులపాటు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా కిసాన్ మోర్చా ఇంఛార్జి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రప్ప, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు, వెంకటగిరి నియోజకవర్గ సభ్యులు SSR నాయుడు, బాలాయపల్లి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు నాగూర్ రాజు తదితర కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున యాత్రలో పాల్గొని అమరావతి రైతులతో కలిసి పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రం నలుమూలల నుండి అందరికీ రాకపోకలు సాగించటానికి అనువుగా ఉండాలన్న ఉద్దేశ్యంతో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నాటి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే, దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతి అభివృద్ధికి శంకుస్థాపన చేసి వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారన్నారు.
కానీ, నాటి ముఖ్యమంత్రి సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాన్ని, హైకోర్టు ఇలా అన్నింటినీ తాత్కాలికంగా నిర్మిస్తే, ఇప్పుడొచ్చిన ముఖ్యమంత్రి మూడు రాజధానులంటూ మాట మార్చడం వేల ఎకరాల సాగుభూమిని రాజధాని కోసం ఇచ్చిన రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది.
నాటి నుండి నేటి వరకు దాదాపు రెండు సంవత్సరాలుగా రైతులు దీక్షను చేస్తున్నప్పటికీ నేటి వైసీపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించటాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఈ మహా పాదయాత్రకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చి రైతులకు అండగా యాత్రలో పెద్దఎత్తున పాల్గొంటోంది.
గతంలోనే రైతులు దీక్ష చేస్తున్న సమయంలో వారి దీక్షకు సంఘీభావం తెలుపుతూ అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని తీర్మాణం చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని గుర్తు చేశారు.
భవిష్యత్తులో కూడా రైతులకు సంపూర్ణ మద్దతు తెలియజేసి, అమరావతికి అండగా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం జేడీ లక్ష్మీనారాయణ తో కలసి పాదయాత్ర నిర్వహించారు.
.