ప్రజాబలం ఉన్న కార్యకర్తలను, చిత్తశుద్ధితో ప్రజల్లో ఉంటూ వారి అభిమానం సంపాదించగల నాయకులను పార్టీ ఎప్పుడూ కూడా నెత్తిన పెట్టుకుంటుంది. అడ్డదారుల్లో పార్టీల్లోకి వచ్చి అందంల ఎక్కే వారు మాత్రమే.. తమ అస్తిత్వం గురించి, మనుగడ గురించి భయపడుతూ ఉండాలి.
కష్టించే వారిని పార్టీ తనంతగా గుర్తించి ఆదరిస్తుంది- భుజం తడుతుంది. ఇటీవలి బద్వేలు ఎమ్మెల్యే ఉప ఎన్నికలో.. విజయావకాశాలు మృగ్యం అని తెలిసినప్పటికీ.. భారతీయ జనతా పార్టీ తరఫున బరిలోకి దిగి.. రాష్ట్రంలో బీజేపీకి గత ఎన్నికల్లో ఎక్కడా రానన్ని ఓట్లు సంపాదించి.. తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న పనతల సురేష్ విషయంలో ఈ సిద్ధాంతం మరోసారి నిజమైంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడురోజుల తిరుపతి పర్యటన అనంతరం తిరిగి వెళుతున్న సమయంలో ఆయనను కలవడానికి విమానాశ్రయానికి పనతల సురేష్ కూడా వచ్చారు. అయితే అమిత్ షా వెంట విమానం వరకు వెళ్లి వీడుకోలు చెప్పడానికి అధికారులు తయారుచేసిన లిస్టుల్లో సురేష్ పేరు లేదు. ఆయన బయటే ఉండిపోవాల్సి వచ్చింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పూనుకుని- అధికారులతో మాట్లాడి పనతల సురేష్ లోనికి తీసుకువచ్చారు. అమిత్ షాకు పరిచయం చేశారు. బద్వేలు ఉప ఎన్నికలో పోరాడిన వైనం వివరించారు.
దాంతో అమిత్ షా, పనతల సురేష్ భుజం తడుతూ ‘అచ్ఛే తరహ్ లడే హై సురేష్ జీ, బధాయియో, అవుర్ అచ్ఛే తరహ్ లడో’ అంటూ ప్రశంసించారు. ‘బాగాపోరాడావు సురేష్, అభినందనలు.. ఇంకా బాగా పోరాడు’ అన్నారు. రెండు నిమిషాలు సురేష్ తో మాట్లాడారు. బద్వేలు ఉప ఎన్నికలో పడ్డ కష్టం మరచిపోయేలా, దక్కిన 20వేల పైచిలుకు ఓట్ల ప్రజాదరణను మించిపోయేలా.. పనతల సురేష్ కు అమిత్ షా అభినందనలు దక్కాయి.
Also read : చిల్లిగవ్వ లేకుండా ప్రజాదరణ కూడగట్టుకున్న సురేష్
2019 ఎన్నికల్లో పనతల సురేష్ కడప జిల్లా కోడూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇటీవలి బద్వేలు ఉప ఎన్నికలో పార్టీకోసం మళ్లీ బరిలోకి దిగాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ఇంటింటికీ శ్రద్ధగా ప్రచారం నిర్వహించడం ద్వారా గణనీయమైన ఓట్లు సంపాదించారు. దానికి తగ్గట్టుగానే.. ఇవాళ అమిత్ షా గుర్తింపు లభించింది.
.