జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం. రచయితగా, ప్రచురణకర్తగా ఆయనకు ఎదురైన స్వానుభవాలు ఈ Writer’s Blues. నలభైకి పైగా పుస్తకాలు తీసుకువచ్చిన వ్యక్తిగా.. ఆయన అనుభవాలను adarsini.com పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ వ్యాసపరంపరలో ఇది అయిదవది.
‘ప్రచారం’ అనే పదం విలువ వ్యాపారసంస్థలకే కాదు, వారికంటె ఎక్కువగా రాజకీయ నాయకులకు తెలుసు? ప్రచారం పొందడానికి ప్రతి ఒక్కరి బుర్రలోనూ బోలెడేసి మార్గాలుంటాయి. కొన్ని రాచమార్గాలు, కొన్ని అడ్డదారులు. అయితే.. ప్రచారం పొందడాన్ని కూడా ఒక శాస్త్రీయ దృక్పథంతో అందించిన పుస్తకం ‘ప్రచారం పొందడం ఎలా?’ పుస్తకం గురించి విని.. ఆహా ఓహో అని అన్నటువంటి వేలాదిమంది మాత్రం ఓ భిన్నమైన అనుభవాన్ని మిగిల్చారు. వివరాల్లోకి వెళ్దాం..
వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నారు. ‘ప్రచారం పొందడం ఎలా?’ పుస్తకం కోసం ఇంటర్వ్యూ అడగ్గా జి.వల్లీశ్వర్ మాటసాయం చేయడంతో వై.యస్. అంగీకరించారు. ఆయన ఎదురుగా కూచుని ఉన్నాను. ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ –
‘‘మేం అధికారంలోకి రాగానే పచ్చ చొక్కాల భోజన పథకమైన జన్మభూమిని రద్దు చేస్తాం’’ ఆవేశంగా చెప్తున్నారు.
నేను ఆయన మాటలకు అడ్డు తగిలాను.
‘‘బానే ఉంది, కానీ మీది రద్దుల ప్రభుత్వం అనే ముద్ర వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడున్న వాటినన్నింటినీ రద్దు చేసేస్తారని ప్రజలు అనుకుంటారుగదా!’’ అన్నాను.
వై.యస్. ఒకక్షణం కళ్లు మూసుకుని ఆలోచనలో పడి –
‘‘మేం అధికారంలోకి రాగానే జన్మభూమి స్థానంలో మరింత మెరుగైన పథకాన్ని ప్రవేశపెట్టి ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతాం’’ అని తన సమాధానాన్ని మార్చి చెప్పారు.

అప్పటిదాకా వై.యస్. చెప్తూ వస్తున్న లైనుకు ఇది సవరణ. ఇందులో వార్తాంశం ఉంది. ఆయన ఇంటర్వ్యూ పుస్తకంలో ప్రచురించటానికి కొన్ని నెలల టైము పడుతుంది. వెంటనే ఏదైనా పత్రికలో ప్రచురిస్తే బావుంటుందనిపించి కె.రామచంద్రమూర్తి గారి దగ్గరకెళ్లి విషయం చెప్పాను. అప్పుడాయన ‘వార్త’కు ఎడిటర్‌గా ఉన్నారు. నేను చేసిన ఇంటర్వ్యూను ఆ మర్నాడు ఉదయం వెలువడే పత్రికలో ఎడిట్ పేజీలో నా పేరుతోనే ప్రచురించారు.
వై.యస్.రాజశేఖరరెడ్డి ఆతర్వాత తిరుపతి సభలో మాట్లాడుతూ నాకు సవరించి చెప్పిన విషయాన్నే వెల్లడించారు. చాలా పత్రికలు వై.యస్. ప్రసంగాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.
1999లో నేను రాసి ప్రచురించిన ప్రచారం పొందడం ఎలా? పుస్తకంతో ముడిపడి చాలా జ్ఙాపకాలు ఉన్నాయి?
వై.యస్.తోపాటు అన్ని పార్టీల నేతల ఇంటర్వ్యూలను కూడా మీడియా సంబంధాలు- నిర్వహణ కోణంలో చేశాను. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో ఆయన ఇంటర్వ్యూ సంపాదించలేకపోయాను. ప్రజాసంబంధాల గురువు సి.వి.నరసింహారెడ్డి ఆ లోటును భర్తీ చేశారు. ప్రచారంలో చంద్రబాబు శాస్త్రీయ బాణీ శీర్షికతో సి.వి.నరసింహారెడ్డి ఇంటర్వ్యూ ప్రచురించాను. తెలుగుదేశం తరపున కోడెల శివప్రసాదరావు, బిజెపి తరపున పి.వేణుగోపాలరెడ్డి, సి.పి.ఎం. పక్షాన బి.వి.రాఘవులు, సి.పి.ఐ.తరపున సురవరం సుధాకరరెడ్డిని ఇంటర్వ్యూ చేశాను. రేడియో కవరేజి గురించి ఆర్.వి.వి.కృష్ణారావు ఇంటర్వ్యూ ఇచ్చారు.
పార్టీ పత్రికలతో ప్రయోజనాలెన్నో అనే అధ్యాయం రాసేందుకు పార్టీ పత్రికలతో అనుబంధం ఉన్న ఎ.ఎస్.ఆర్.ప్రసాద్ తో మాట్లాడాను. ఆయనకు నేను రాసిన అధ్యాయం చదవమని ఇచ్చాను. చదివాక ఆశ్చర్యపోతూ ‘ఏమిటీ! ఈ విషయాలన్నీ నేనే చెప్పానా?!’ అని ప్రసాద్ వ్యాఖ్యానించారు.
సి.వి.నరసింహారెడ్డికి ముందుగా పోస్టులో ప్రశ్నలను పంపగా వెంటనే ఫోనులో స్పందిస్తూ – ‘మిమ్మల్ని మంచి రిపోర్టర్ అనాలో మంచి పీఆర్వో అనాలో అర్థం కావడంలేదు’ అన్నారు.
‘మీకు ఎందుకొచ్చింది ఈ సందేహం’ అని అడిగితే –
‘ప్రశ్నల సరళి బావుంది. దాంతోపాటు రాసిన కవరింగ్ లెటర్ లో పిఆర్వోలు పాటించే విధివిధానాలన్నీ అనుసరించటం. పి.ఆర్.మ్యాన్‌గా ఆనందం కలిగించింది’ అని నరసింహారెడ్డి చెప్పారు.
ఈ పుస్తకం రాయటానికి ముందే బి.జె.పి. కోసం 32 పేజీల బుక్ లెట్ ఇదే అంశంమీద రాసి ఇచ్చాను. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీడియా మేనేజ్మెంట్లో కార్యకర్తలను గైడ్ చేస్తూ చిన్న పుస్తకం రాస్తానని అప్పట్లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వేణుగోపాలరెడ్డి ముందు ప్రతిపాదించాను. దానికి ఆయన వెంటనే అంగీకరించడంతో కొన్ని టిప్స్‌తో పుస్తకం రాసిచ్చాను. బి.జె.పి. ప్రచురించిన ఆ పుస్తకంలో రచయితగా నాపేరు అట్టమీద కూడా ఉంది.
దీనిపై ఒక జర్నలిస్టు మిత్రుడు స్పందిస్తూ – ‘‘ఆర్.ఎస్.ఎస్.లో చురుగ్గా పనిచేసేవారు కూడా తాము బిజెపితో బాహాటంగా ఐడెంటిఫై కావటానికి వెనకాడతారు. అలాంటిది మీపేరుతోనే బిజెపి ప్రచురణ వచ్చింది.’’ అని కామెంట్ చేశాడు.

‘‘నేను ప్రొఫెషనల్‌ని బిజెపి అయినా కమ్యూనిస్టు పార్టీ అయినా నాకు ఒకటే. కమ్యూనిస్టులు అడిగినా వారికీ ఈ పుస్తకం రాసి ఇచ్చేవాణ్ని’’ అని చెప్పాను. బుక్‌లెట్‌గా తెచ్చిన పుస్తకాన్ని విస్తరించి సమగ్రంగా రాయాలని నిర్ణయించి ఆ దిశగా రచన మొదలుపెట్టాను. ఈ టాపిక్‌పై ఇంగ్లీషులో ఏవైనా పుస్తకాలు దొరుకుతాయేమో చూద్దామని బుక్‌స్టాల్‌కు వెళ్లి గాలించాను. అక్కడ ‘పబ్లిసిటీ ఫర్ ఫ్రీ’ అనే టైటిల్ తో నాకు కావలసిన పుస్తకం దొరికింది.
మనం ఇంకా ఆలోచన స్థాయిలోనే ఉన్న సబ్జెక్ట్‌పై అంతకుముందే ఇంగ్లీషువారు రాసి అందుబాటులోకి తేగలగటం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఇదొక్కటే అని కాదు, చాలా సబ్జెక్టులపై అమెరికన్, బ్రిటిష్ రచయితలు విస్తారంగా లోతుగా రాస్తున్నారు. విలేకరుల సమావేశం ఎలా నిర్వహించాలి? అనే టాపిక్ మీద బ్రిటిష్ లైబ్రరీలో 300 పేజీల పుస్తకం తారసపడింది.
ఈమధ్య కరోనా బారిన పడి కన్నుమూసిన జర్నలిస్టు వై.శ్రీనివాసరావు గురించి ఇంటర్వ్యూలో పి.వేణుగోపాలరెడ్డి ప్రస్తావించారు. మంచి జర్నలిస్టులూ మనమధ్యే ఉన్నారు శీర్షికతో ఆయన ఇంటర్వ్యూ ప్రచురితమైంది. శ్రీనివాసరావు పేరు ప్రస్తావించకున్నా వేణుగోపాలరెడ్డి ఆయన గొప్పతనాన్ని ఇలా గుర్తుచేసుకున్నారు.
‘‘పేరు చెప్పడం బావుండదు కానీ, ఒక సంఘటన చెప్తా. ఓసారి శ్రీశైలంలో మా పార్టీ సమావేశం జరిగింది. ఆ వివరాలను రిపోర్టు చెయ్యటానికి పత్రికా విలేఖరి వచ్చారు. సమావేశం పూర్తయ్యాక ఫ్యాక్స్ ద్వారా వార్త పంపడానికి కొండకిందకు వెళ్లబోతున్నాడు. జీపు తీసుకెళ్లమన్నా వొద్దన్నాడు. ఫరవాలేదని నచ్చచెప్పి, మా డ్రైవర్‌ను పిలిచి కాఫీ, టీలు, భోజనం, ఫ్యాక్స్ బిల్లు వగైరాలు చెల్లించడానికి డబ్బు ఇచ్చి తగు సూచనలు చెప్పి పంపాను. రిపోర్టరు పనులన్నీ పూర్తయి హైదరాబాద్ బస్సు ఎక్కేదాకా ఉండి, రాత్రికి మా జీపు డ్రైవరు తిరిగి వచ్చాడు. రాగానే నేను అతనికి ఇచ్చిన పైకం మొత్తం యథాతథంగా నాకు తిరిగి ఇచ్చేశాడు. ఇదేంటి? ఏమీ ఖర్చు కాలేదా? అన్నాను. లేదు సార్! కాఫీక్కూడా నన్ను డబ్బులివ్వనివ్వలేదు. పైగా నేను వద్దంటున్నా మన జీప్ లో 10 లీటర్ల డీజిల్ కొట్టించి డబ్బు ఆయనే ఇచ్చాడు సార్’’ అని మా డ్రైవర్ చెబితే నిరుత్తరుణ్నయిపోయా.’’
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఏకంగా రెండు కవర్ డిజైన్లు
పొత్తూరి వెంకటేశ్వరరావుకు ఈ పుస్తకం అంకితం ఇచ్చాను. ఆర్టిస్ట్ మోహన్ రెండు కవర్ డిజైన్లు చేసి ఏదైనా వాడుకోవచ్చునంటే వివిధ పార్టీల నేతల చిత్రాలతో రూపొందించిన కవర్‌ను ఎంచుకుని, రెండో డిజైన్‌ను వృథా పోనీయకుండా మొదటి అధ్యాయంలో వాడాను
మార్పులు చేశారు
కవర్ డిజైన్లతోపాటు లోపల చాలా కార్టూన్లు కూడా గీసిచ్చారు మోహన్. కవర్ డిజైన్ లో చిన్న మార్పు సూచిస్తే వెంటనే సరిచేసి ఇచ్చాడు. మోహన్. కవర్‌పై ఒక మహిళ పళ్లెంలో మద్యం సీసాలు పెట్టుకున్నట్లు గీయగా, అది అభ్యంతరం కావచ్చునని చెబితే ఆ సీసాల స్థానే పన్నీరు బుడ్డి, కుంకుమ భరిణె గీశారు. లోపల కార్టూన్లలో కూడా ఒకదాని రైటప్ లో ‘యాదవ్’ అనే మాట వాడితే పేచీలొచ్చే ప్రమాదం ఊహించి ఆ పేరును మార్చమన్నాను. దాన్ని‘యాదయ్య’ను చేశాడు.
కొసమెరుపు
హైదరాబాద్ తెలుగుదేశం ఆఫీసులో పార్టీ క్రియాశీల కార్యకర్తలకు మీడియా రిలేషన్సుపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, మీరు వచ్చి ఒక లెక్చరు ఇవ్వాలని దాడి వీరభద్రరావు ఆహ్వానించారు. చంద్రబాబు పబ్లిసిటీకి ఇచ్చే ప్రాధాన్యం దృష్ట్యా అదే టాపిక్‌పై రాసిన పుస్తకాన్ని బాగా అమ్మవచ్చని ప్లాన్ చేశాను. ఎటూ మీడియా పబ్లిసిటీపై క్లాసు చెబుతున్నాను. ఇందులో ఇంకా ఎన్నో మహత్తర విషయాలు ఉన్నాయని పుస్తకం చూపిస్తూ కార్యకర్తల్లో ఆసక్తి కలిగించ ప్రయత్నించాను. హాలు వెలుపల ఈ పుస్తకం అమ్మటానికి అందుబాటులో ఉందనీ చెప్పాను.
శిక్షణ శిబిరంలో 600మందికి పైగా కార్యకర్తలు పాల్గొంటున్నారని చెప్పేసరికి ప్రతి కార్యకర్తా ఒక కాపీ విధిగా కొంటాడని ఊహించి, రెండు అట్టపెట్టెల నిండా పుస్తకాలు సర్దించి సహాయకుడితో ఆటోలో చేరవేయించాను. అంతమంది కార్యకర్తలు శిక్షణలో పాల్గొన్నా, నేను ఆకట్టుకునేలా లెక్చర్ దంచినా ప్రచారం పొందడం ఎలా? పుస్తకం ఒక్క కాపీ కూడా ఎవరూ కొనలేదు.
సేల్స్ కౌంటర్‌కు వచ్చిన వారు యోగ పుస్తకం ఉందా? అని అడగటం ఆశ్చర్యం కలిగించింది. క్లాసు చెప్పినందుకు తెలుగుదేశం వారెటూ చిల్లిగవ్వ పారితోషికం ఇవ్వలేదు. రానూపోనూ ఆటో చార్జీకి, సహాయకుడికి జేబులోంచి బానే చిలుము వదిలింది.
మరోసారి బిజెపి సభలో కూడా ఇదే అనుభవం ఎదురైంది. నాకు తెలిసిన వ్యక్తి ఒక పుస్తకం కొన్నాడు.
కారు చీకటిలో కాంతిరేఖ
ఈ అనుభవాలు ఇంతటితో ముగియలేదు. కారు చీకటిలో కాంతిరేఖలూ ఉంటాయి. రైతుకూలీ సంఘం వారికోసం కరపత్రాల తయారీపై శిక్షణ ఇవ్వాలని పిలిచారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సి.పి.ఎం. వారి ఆఫీసులో క్లాసు చెప్పాను.
పట్టువదలని విక్రమార్కుడిలా వెంట నలభై కాపీలు అమ్మకానికి తీసుకువెళ్లాను. క్లాసు అయ్యాక పుస్తకాన్ని పరిచయం చేశాను. మీనేత రాఘవులు గారి ఇంటర్వ్యూ కూడా ఉందని చెప్పాను.
అలా చెప్పటం ముగించానోలేదో క్షణాల్లో నలభై కాపీలు కొనేశారు. ఆ శిక్షణలో పాల్గొన్న నలభైమందీ తలా ఒక కాపీ కొన్నారు.
కాస్త లేటుగా అయినా ప్రచారం పొందటం ఎలా? పుస్తకాన్ని రీప్రింట్ చేయగలిగాను.
..డాక్టర్ గోవిందరాజు చక్రధర్

.
Discussion about this post