చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ పనులు మహాశివరాత్రి లోపే ప్రారంభించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 8వ తేదీనే ప్రాకార నిర్మాణానికి భూమి పూజ చేయాల్సి ఉంది. ముహూర్తం కూడా ఖరారైంది.
అయితే రాష్ట్ర దేవదాయశాఖలోని ఓ కీలక అధికారి సమీప బంధువు ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ ముహూర్తం వాయిదా పడింది. మరో వారం రోజుల్లో ప్రాకార నిర్మాణానికి భూమి పూజ చేయడానికి ముక్కంటి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే జరిగితే జంగమయ్య భక్తుల కష్టాలు చాలా వరకు తీరినట్టే.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం దినదినాభి వృద్ధి చెందుతోంది. ఇక్కడ నిర్వహించే రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు దేశ విదేశాలకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తుంటారు. ముక్కంటి దర్శనం కోసం నిత్యం సగటున 30 నుంచి 40వేల మంది వరకు వస్తుంటారు. వారాంతాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో ముక్కంటి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఆశయంతో తెలుగుదేశం హయాంలో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు అప్పటి ఆలయ ఈవో భ్రమరాంబ మాస్టర్ ప్లాన్ అమలుకు భూసేకరణకు శ్రీకారం చుట్టారు.
ఆలయానికి సమీపంలోని సన్నధివీధిలో 199 కుటుంబాలకు చెందిన సుమారు 4 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఆ మేరకు దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వులు పొంది.. భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. బాధితులకు సుమారు రూ.100 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు.
మొదట్లో ఈ ప్రక్రియ చాలా వేగవంతంగా జరిగింది. అయితే సన్నిధివీధికి చెందిన కొంతమంది బాధితులు పరిహారం విషయంలో హైకోర్టును ఆశ్రయించడంతో భూ సేరకణ సమస్యగా మారింది. వారితో పలుమార్లు చర్చించినా ఫలితం లేక పోయింది. అప్పట్లో వారానికి ఒకసారి ముక్కంటి మాస్టర్ ప్లాన్ పై కలెక్టరు ఆధ్వర్యంలో సమీక్ష జరిగేది.
అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల కారణంగా మాస్టర్ ప్లాన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇక రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత ఈ ప్రక్రియ మరింత మందగించింది. అయితే ఇటీవల కొంతకాలంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక దృష్టి సారించారు. పరిహారం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితులతో ప్రత్యేకంగా చర్చించి ఒప్పించారు.
ఒకరు తప్ప మిగిలిన వారందరూ పరిహారం తీసుకోవడానికి అంగీకరించారు. ముక్కంటి బాధితులకు ఇప్పటి వరకు రూ.78 కోట్లు పరిహారం చెల్లించారు. కొంతమందికి ఇళ్ల పట్టాలు కూడా అందజేశారు. భూసేరకణ ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో మాస్టర్ ప్లాన్ పనులు వేగవంతం చేయడానికి ముక్కంటి ఆలయ కార్య నిర్వహణాధికారి పెద్దిరాజు కృషి చేస్తున్నారు. ఆలయ ఇంజనీరింగ్ అధికారులతో మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన నివేదికలు కూడా తయారు చేయించారు.
ఈ పనులు రెండు దశల్లో చేసే విధంగా ఇంజనీరింగ్ అధికారులు నివేదికలు రూపొందించారు. ఇందుకోసం సుమారు రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నివేదికలను దేవదాయశాఖ ఉన్నతాధికారులకు పంపారు. వారు కూడా వీటిని ఆమోదించారు.
రెండు దశల్లో చేయనున్న ఈ పనుల్లో భాగంగా… మొదట ప్రాకారం నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాకార పనులకు ఈ నెల 8న భూమి పూజ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లె శ్రీనివాస్, ఆశాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరు అవుతారని ముక్కంటి ఆలయ అధికారులకు సమాచారం వచ్చింది.
అయితే దేవదాయశాఖలో ఓ కీలక అధికారి సమీప బంధువు ఆకస్మికంగా మృతి చెందడంతో ఈ భూమి పూజ వాయిదా పడింది. మరో వారం రోజుల్లో ఈ భూమి పూజ చేయడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ముహూర్తం ఖరారు చేస్తామని… మహాశివరాత్రిలోగా మాస్టర్ ప్లాన్ పనులు తప్పకుండా ప్రారంభిస్తామని ఆలయ డీఈ మురళీధర్ రెడ్డి చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
.