మనలో లోపాలను ఇతరులు గుర్తించి చెప్పినప్పుడు మనకు కాస్త బాధ కలుగుతుంది. ఎంతటి స్థితప్రజ్ఞులకైనా ఇలాంటి బాధ కొంచెమైనా ఉంటుంది. అయితే లోపాలను తెలుసుకోకపోతే.. మనల్ని మనం దిద్దుకోవడం ఎలాగ? మన లోపాలను మనమే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చేస్తే.. మనకంటె బాగా వాటిని కనిపెట్టగలవారు మరొకరు ఉండరు. కనిపెట్టాలంటే.. మనకు లోపలి చూపు ఉండాలి. అంతఃవీక్షణం జరగాలి.
ఉదయం లేవగానే భగవంతుడిని ప్రార్థించాలని కొందరు చెబుతారు. ఉదయం లేవగానే ఇవాళ ఏం పనులు చేయాలనుకుంటున్నామో వాటి మంచి చెడులేమిటో ఒకసారి మననం చేసుకోవాలని కొందరు చెబుతారు. ఇలాంటి సలహాలు అనేకం ఉంటాయి. ఇదే తరహాలో రాత్రి పడుకునే ముందు ఓసారి లోపలిచూపు కలిగి ఉండడం ముఖ్యం. మనం పగలంతా ఏం పనులు చేశామో.. వాటిలో మంచి చెడులేమిటో తూకం వేసుకోవడం అవసరం. ఇలా రోజూ చేసిన పనులను గుర్తు చేసుకుంటే చాలు.. కొన్నాళ్లకు మన ప్రవర్తనే మంచి పనులు మాత్రమే చేసే తీరుగా తయారవుతుంది.
ఇదే విషయాన్ని ఓ సుభాషితం ఇలా చెబుతుంది.
ప్రత్యహం ప్రత్యవేక్షేత్ నరశ్చరితమాత్మనః
కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి
ప్రతిరోజూ కూడా మనం మన ప్రవర్తన గురించి లోపలిచూపు కలిగి ఉండాలి. అంతస్సమీక్ష ఉండాలి. నాలోని ఏ లక్షణాలు పశువు లక్షణాలతో పోలి ఉన్నాయి. నాలో ఏ లక్షణాలు మంచివాళ్లతో పోలి ఉన్నాయి.. అని మనం ప్రతిరోజూ ఆత్మ సమీక్ష చేసుకోవాలి. ఆ రకంగా మనలో ఉండే మంచి లక్షణాలను వెలికి తీసుకురావాలి. -అనేది శ్లోకభావం.
లోపలి చూపు అనేది ప్రతి మనిషికీ చాలా ముఖ్యం. మనలోని మంచి చెడుల గురించి గానీ.. మనలోని సమర్థత చేతగానితనం గురించి గానీ.. బయటినుంచి చూసే ఎంతటి వారికంటె మనకే బాగా అర్థమవుతుంది. Introspection అంటాం మనం. ప్రతి మనిషికీ దాని అవసరం చాలా ఉంది.
లోపలి చూపు అనేది కేవలం పశు (చెడు) లక్షణాలు- మంచి లక్షణాలకు సంబంధించి మాత్రమే కాదు. మన శక్తి సామర్థ్యాల విషయంలో కూడా ఇలాంటి లోపలిచూపు అవసరం. మనం ఏదైనా వ్యాపారమో, జీవితంతో ప్రయోగమో చేయాలనుకున్నప్పుడు.. ముందు మన శక్తి ఎంతో చూసుకోవాలి. దానికంటెముందు మన శక్తి హీనత, బలహీనత ఏమిటో పరీక్షించుకోవాలి. ఆ తర్వాతే ఆ ప్రయోగానికి పూనుకుంటే వైఫల్యం ఉండదు. ప్రతి విషయంలోనూ ఈ సిద్ధాంతం పనిచేస్తుంది. నిరంతరమైన లోపలిచూపు మనల్ని మరింతగా క్రియాశీలంగా, సమర్థంగా తయారుచేస్తుంది.
శుభోదయం.
.

Discussion about this post