ఆయన ఒక రాజకీయ ఉద్దండుడు అనడంలో తప్పు లేదు. రెండుసార్లు తిరుగులేని ప్రజాబలంతో గెలిచి అధికారం చేపట్టారు. గతంలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఆయనకి ఒకరు సలహా ఇవ్వరూ ఇచ్చేంతా సహాసమూ చేయలేరు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు ఫాంహౌస్ లోంచే పరిపాలించిన ఈ నాయకుడు ఇప్పుడు గడప దాటి బయటకు రావాల్సి వస్తోంది.
ఏదైనా కొత్త పథకం తేవాలన్నా ఆయనదే ఆలోచన, వచ్చిన ఆలోచనని తక్షణమే అమల్లో పెట్టేది ఆయనే. ఆయన పలానా పని కావాలంటే ఇలా చెబితే చాలు అలా అయిపోవాల్సిందే. ఒంటి చేత్తో.. కాదు కాదు.. తెలంగాణ లోకమంతా వెంట నడిచి రెండు సార్లు అధికారంలోకి తెచ్చారు. ఎవరైనా పార్టీలో చేరాలన్నా ఆయనదే తుది నిర్ణయం, పార్టీ వీడాలన్నా.. ఆయన హుంకరింపే వారికి గెంటివేత!
కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆయనకే సవాళ్లు విసిరేంత ధైర్యం వచ్చింది ఆ మంత్రివర్గంలో.. నీ దగ్గర పని చేస్తే ఎంత.. చేయకపోతే ఎంత.. ప్రజల్లో గెలిచాం ప్రజల మధ్యే తేల్చుకుంటాం. ఇక సమరమే అని సవాళ్లు చేసి పార్టీ నుండి బయటకు వచ్చేస్తున్నారు. శపథం చేసి మరీ గెలుస్తున్నారు. ఈ పరిస్థితులకు కారణం ఎవరూ అని ఆలోచించిన సీఎం- కొడుకును, అల్లుడిని, మంత్రులను, కార్యకర్తలను నమ్ముకుంటే నట్టేట ముంచేస్తన్నారు అని, మరో మారు స్వీయ తప్పిదం చేయకూడదు అనే తనే రంగంలోకి దిగారు.
దుబ్బాక ఎన్నికలు మొదలుకొని మొన్న జరిగిన హుజురాబాద్ ఎన్నికల వరకు అధికార పార్టీ తెరాసకు గట్టి దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ వచ్చిన ఫలితాలు అధికార మత్తులో ఉన్న సీఎం కేసీఆర్‌కి దిమ్మ తిరిగే షాక్‌నిచ్చాయి. దుబ్బాక మరియు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అత్యంత నమ్మకస్తుడైన, ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న తన మేనల్లుడిని రంగంలోకి దింపారు. కానీ అక్కడ ఫలితం తెరాసకు నిద్రపట్టని రాత్రులను మిగిల్చింది. ఇక హుజురాబాద్‌లో కూడా అంతే అధికార పార్టీకి తాడో పేడో తెల్చుకోవాల్సిన ఎన్నికలుగా మార్చాయి. అయినా కానీ ఈటల గట్టి పోటీనిచ్చి తనదైన శైలిలో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇక వీటి మధ్యలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కేటీఆర్‌ని రంగంలోకి దింపిన ఆశించిన ఫలితం రాబట్టుకోలేకపోయింది అధికార పార్టీ. అన్ని ఎన్నికల్లోకి కలిపి.. నాగార్జున సాగర్ విజయం ఒక్కటే కంటితుడుపు.
అయితే తెలంగాణలో భాజపా బలపడుతుందన్న సంకేతాలను అందిపుచ్చుకున్న సీఎం ఆ పార్టీపై పోరాటం చేయడానికి సిద్ధమయ్యాడు. మొదట పెట్రోల్ ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని విఫల ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సమయంలో కేంద్రం పెట్రోల్‌పై సుంకాన్ని తగ్గించింది దీంతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ ధరలు తగ్గించారు. కానీ తెలంగాణలో మాత్రం ధర తగ్గించలేదు. ఇది ప్రజల్లో బాగా వ్యతిరేకత తెచ్చింది. తన ప్లాన్ బూమరాంగ్ అయిందని గుర్తించిన సీఎం.. మరో కుంపటి ముందుకు వేసుకున్నారు.
రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదు.. తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ధర్నా సైతం చేశారు. అయినాకానీ దానివలన ఆశించిన ఫలితం రాలేదు. వానాకాలంలో పండించిన పంటను కొనకుండా.. యాసంగి పంట గురించి యుద్ధం చేయడం ఏందని ప్రతిపక్షాలు, ప్రజలు మండిపడ్దారు. ఇక తాడో పేడో తేల్చకుందాం, డిల్లీలో తేల్చుకుంటా అని హస్తినా బయలు దేరారు. కానీ అక్కడ ప్రధాన మంత్రి సీఎంకి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఇతర మంత్రులతో భేటీ అయ్యారు గానీ ఫలితం లేదు.
దీంతో తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత సీఎం ప్రస్తుతం చల్లబడ్డాడు అని చెప్పుకోవచ్చు. కానీ గత సాధరణ ఎన్నికల ముందు థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి దేశాన్ని పాలించాలని కలలుగన్న సీఎం ఆశలు- అడియాశలుగానే మిగిలిపోయాయి. పొరుగు రాష్ట్రాలకు తిరిగి తిరిగి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఆ థర్డ్ ఫ్రంట్ ముచ్చట అటకెక్కింది.
ప్రస్తుతం తెలంగాణలో తన సొంత పార్టీని కాపాడుకోవాడానికి నానా తిప్పలు పడుతున్నారు. సాధారణంగా సెక్రటేరియేట్ కు కూడా రాకుండా.. తన ఫాంహౌస్ నుంచి రాష్ట్ర పరిపాలన మొత్తం నడిపిస్తూ ఉండే కేసీఆర్ కు ఇక ఆ వైభవం చెల్లిపోయిదా అనే అభిప్రాయం కలుగుతోంది. ఆయన తడవకోసారి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తోంది. ప్రజల ముందుకు రావాల్సి వస్తోంది. హైదరాబాదులో జనానికి కనిపించాల్సి వస్తోంది. ఢిల్లీ వెళ్లాల్సి వస్తోంది. కేసీఆర్ ఆరోగ్యం గురించి పుకార్లు పుట్టేంతగా నెలల తరబడి బయట కనిపించకుండా ఫాం హౌస్‌లోనే గడపడం అలవాటు చేసుకున్న కేసీఆర్.. ఇప్పుడు ఫాం హౌస్ ఊసు మరిచిపోయే పరిస్థితి.
పార్టీని కాపాడుకోవాలంటే నిత్యం ప్రజల మధ్యనే గడపాల్సిన పరిస్థితిని బీజేపీ సృష్టించింది. అందుకే, పుట్టలోంచి బయటకి వెళ్లిన పాము.. ఇక తిరగడమే తప్ప.. తిరిగి పుట్టలోకి వెళ్లి రెస్ట్ తీసుకుందామనుకునే అవకాశం లేకుండా పోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
.. కె. శ్రీనివాస్
Discussion about this post