మనలో చాలా మంది తమ ప్రతిభకు గుర్తింపు దక్కడం లేదని మధన పడుతుంటారు. ఒక రకమైన న్యూనతకు గురవుతుంటారు. మీ ప్రతిభల గురించి, మీ శక్తి సామర్థ్యాల గురించి మీకు నిజంగా పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నట్లయితే గనుక.. మీరు మరొకరి గుర్తింపు గురించి తపన పడే అవసరమే ఉండదు.
గుర్తింపు వల్ల ప్రతిభ రాణించదు. సాధన వల్ల మాత్రమే రాణిస్తుంది. ఇది మనం ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడానికి ప్రథమ సూత్రం. అదేసమయంలో ఇతరుల్లో ప్రతిభను గుర్తించాలంటే గనుక.. ఇవతలి వారిలో ఆ ప్రతిభల, నైపుణ్యాల గురించిన కనీస జ్ఞానం ఉండాలి. అవగాహన ఉండాలి. అది కూడా లేని పామరుల కూటమి నడుమ ఉంటూ.. నా ప్రతిభకు గుర్తింపు దక్కలేదని అనుకోవడం దండగ.
ఈ విషయాన్నే ఈ సుభాషితం చాలా సరదాగా చెబుతుంది.
గుణీ గుణం వేత్తి న వేత్తి నిర్గుణో బలీ బలం వేత్తి న వేత్తి నిర్బలః
పికో వసంతస్య గుణం న వాయసః కరీ చ సింహస్య బలం న మూషకః
సుగుణాలు ఉన్న వ్యక్తి మాత్రమే ఇతరుల్లోని సుగుణాలను గుర్తించగలడు అంతే తప్ప గుణహీనుడు గుర్తించలేడు. గొప్ప బలవంతుడు మాత్రమే.. ఎదుటి వ్యక్తిలోని బలాన్ని అంచనా వేయగలడు. బలహీనుడికి అలా అంచనా వేయడం కూడా తెలీదు. ఎలాగంటే.. వసంత రుతువులోని మధురిమను కోయిల మాత్రమే గుర్తించగలుగుతుంది.. కాకి కాదు! అలాగే సింహం యొక్క బలాన్ని ఏనుగు గుర్తించగలుగుతుంది.. ఎలుకకు తెలియదు! -అనేది శ్లోకభావం.
మనకు ఆత్మవిశ్వాసం ఇచ్చే చాలా మంచి సుభాషితం ఇది. ఎలుకలు తన బలాన్ని గుర్తించడం లేదే.. అని సింహం మధనపడిపోయి, కుమిలి కునారిల్లిపోతే అర్థం ఉందా? అంతకంటె హాస్యం మరొకటి ఉండదు.
also read : నారా భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యల గొడవ ఇక సద్దుమణిగినట్టేనా?
గుర్తింపు అనేది ఖచ్చితంగా మన విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే ఎవరి నుంచి మనం ఆ గుర్తింపును కోరుకుంటున్నాం? అనేది చాలా కీలకమైన విషయం. ఒక రంగంలో మనం సాధన చేస్తే.. ఒక పని చేస్తే.. ఆ రంగానికి సంబంధించి.. మన సహచరులు, సమ ఉజ్జీలు, ఆ రంగంలో మనల్ని మించిన వాళ్లు గుర్తిస్తే కలిగే ఆనందం.. ఆ రంగంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్లు గుర్తించినంత మాత్రాన, పొగిడినంత మాత్రాన సత్కారాలు చేసినంత మాత్రాన కలగదు.
also read : ప్రత్యేక హోదాపై పార్టీలు డ్రామాలను కట్టిపెట్టే రోజు వస్తుందా?
శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు మాత్రమే కాదు అభిరుచుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. మనకు ఒక అభిరుచి ఉంటుంది. అది గొప్ప అభిరుచి అని మనం అనుకుంటాం. దాని గురించే తెలియని వ్యక్తులనుంచి కూడా మనం అదే భావనను కోరుకుంటే ఆశాభంగమే.
also read : మనలో ఆశావహ దృక్పథాన్ని నింపే సిరివెన్నెల పాటలు
నిజం చెప్పాలంటే విలువను గుర్తించడం ఓ కళ. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకడికి కానుకగా ఒక పేనా వచ్చింది. దాని ఖరీదు లక్ష రూపాయల పైమాటే. ఖరీదైన పేనా జేబులో ఉంటే.. మన విలువ పెరిగిపోతుందని అనుకున్నాడు. అలా జరగలేదు. ఎవ్వరూ పట్టించుకోలేదు. తనే ఒక మెట్టు దిగి.. ఈ పేనా ఖరీదెంతో తెలుసా? అని మిత్రుల్ని అడగడం ప్రారంభించాడు. చూసిన వాళ్లు యాభై, వంద అని చెప్పసాగారు. ఇలా అడుగుతున్నాడంటే ఇదేదో చాలా ఖరీదైన పేనా అయి ఉంటుందని అనుకున్నవాళ్లు వెయ్యి, రెండు వేలు అని చెప్పారు. ఆ జవాబులు అతనికి తృప్తి ఇవ్వలేదు. జేబులోంచి ఆ పేనా తీసి మూలన పడేశాడు. విలువ తెలియని వాళ్ల దగ్గరినుంచి గుర్తింపు కోరుకోవడం.. కేవలం మనల్ని న్యూనతకు గురిచేస్తుంది. అలాగే- అలాగే విలువ తెలయని వాళ్ల పొగడ్తలకు మురిసిపోవడం పతనానికి దారితీస్తుంది.
ముందు ఇది తెలుసుకోవాలి..
మనలోని విలువను ఇతరులు గుర్తించడమూ, గుర్తించకపోవడమూ గురించి చెప్పుకున్నాం. కానీ.. దీనికంటె ముందు మనం ఇతరుల్లోని విలువను, ప్రతిభను, నైపుణ్యాలను గుర్తించడం నేర్చుకోవాలి. ఇతరుల్ని సరిగ్గా అంచనా వేయలేకపోతే, గుర్తించలేకపోతే.. ఆ విషయంలో మనం కూడా మూర్ఖులమే అని లెక్క. అందుకే గుర్తించడం కూడా ఒక కళ.
శుభోదయం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
Discussion about this post