నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా విజయవాడలో స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ (రహదారులు మరియు భవనాల శాఖ) కృష్ణ బాబు ను కలిసి నగరి నియోజకవర్గ పరిధిలోని రోడ్ల దుస్థితిపై వినతి పత్రాన్ని అందించారు.
ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో “నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా” వారు చేపట్టిన రోడ్డు పనులు అద్వాన్నంగా ఉన్నాయని, ఇటీవలి వర్షాలకు చాలవరకు దెబ్బతిందని పేర్కొన్నారు.
గతుకులమయమైన రోడ్డులో వాహనాలు ప్రయాణించడం కష్టంగా ఉందని, దీనివల్ల వాహనాలు దెబ్బతింటూ, ప్రతిరోజూ ఆక్సిడెంట్ అవుతున్నా హైవే అథారిటీ వారు పట్టించుకోలేదని, టోల్ సొమ్ముని మాత్రం యధావిధిగా వసూలు చేస్తున్నారని వాపోయారు.
అసలు హైవే అథారిటీ నిబందనల మేరకు ఇక్కడ నిర్మాణం జరగలేదని, మెయింటనెన్స్ కూడా చేయకపోవడం వల్ల పిచ్చిమొక్కలు, చెట్లతో రోడ్డు అధ్వానంగా ఉందని తెలియజేశారు. దీనిపై వెంటనే స్పందించి రోడ్డుని బాగుచేయించాలని, పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు దర్నాలు, రాస్తారోకోలు చేయడానికి సిద్దంగా ఉన్నారని ఆమె తెలిపారు.
దీనిపై కృష్ణబాబు స్పందిస్తూ, ఈ హైవే ఆంద్రాలో ఉన్నప్పటికీ తమిళనాడు హైవే అధికారుల పరిదిలో ఉన్నందున తమ దృష్టికి రాలేదని హైవే ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే విన్నపం మేరకు ఆమె సమక్షంలోనే NHAI జెనరల్ మేనేజర్, చీఫ్ సెక్రెటరీ, మరియూ హైవే ఉన్నతాధికారి R.O లతో విడివిడిగా ఫోన్లో మాట్లాడి ఇక్కడి దుస్థితిని ఆయన వారికి వివరించారు. అవసరమైతే ఆప్రాంతాన్ని తమ పరిథిలోకి అప్పగించాలని కూడా కోరారు.
దీనిపై వారు సానుకూలంగా స్పందించడమే గాక ఎమ్మెల్యే కోరిన విధంగా వెంటనే రోడ్డు మరమ్మత్తులను చేపడతామని, పనులనుకూడా పరిశీలించి అవకతవకలుంటే వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొంటామని తెలిపారు.
.