దివ్య కాశీ – భవ్య కాశీ సంకల్పంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన “శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్” కారిడార్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించిన సందర్భంగా కెవిబి పురం మండలం కోవనూరు గ్రామంలోని ప్రసిద్ధ సంకల్ప సిద్ధి ఈశ్వరాలయంలో లైవ్ లో ప్రజలు వీక్షించారు.
బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రప్ప, రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, బిజెపి మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, భారతీయ జనతా పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, పిల్లలతో కలిసి ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ ఎంతో పురాతనమైన కాశీ నగరంలో విశ్వనాథుని పుణ్యక్షేత్రం, పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయటమే కాకుండా, కాశీ చేరుకునే రోడ్డు, రైలు, వాయు మార్గాలన్నింటిని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారన్నారు.
ప్రతి హిందువు కూడా తన జీవిత కాలంలో కాశీ నగరాన్ని కనీసం ఒక్కసారైనా సందర్శించాలని, మరికొందరు తమ జీవితంలోని చివరి రోజులను కాశీ నగరంలో గడపాలని కోరుకుంటారన్నారు.
అలాంటి కాశీ నగర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రతి ఒక్క హిందువు కూడా ఋణపడి ఉండాలని కోరారు.
అలాగే మోదీ చెప్పిన స్వచ్ఛత, సృజనాత్మకత, ఆత్మనిర్భర భారత్ సంకల్పాన్ని ప్రతి ఒక్కరం తీసుకుని వాటి సాధనకై కృషి చేయాలని కోరడం జరిగింది.
.