ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి, అది అమరావతి మాత్రమే కావాలి అంటూ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 45 రోజుల పాటు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు తలపెట్టిన మహా పాదయాత్ర నేడు తిరుపతి చేరుకుంది.
ఈసందర్భంలో బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కిసాన్ మోర్చా ఇంఛార్జి చంద్రప్ప, రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి తదితర బిజెపి కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలతో కలిసి యాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ, అనేక అడ్డంకులు సృష్టిస్తూ ప్రభుత్వం ఒక వైపు, కుండపోత వర్షాలు, చలితో ప్రకృతి మరోవైపు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నా, భూములిచ్చిన నేరానికి గుండెల నిండా బాధ ఉన్నా యాత్ర సాగించారని అన్నారు.
ఒక బలమైన సంకల్పంతో 45 రోజులుగా రైతులు, మరీ ముఖ్యంగా మహిళలు సాగిస్తున్న ఈ మహా పాదయాత్ర నేడు వేంకటేశ్వర స్వామి చెంతకు చేరుకుందన్నారు.
యాత్ర పొడవునా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.
వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంకల్పం నెరవేరే వరకు భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుందని, అమరావతిని సాధించుకు తీరుతామని స్పష్టం చేశారు.
.