గుడి పక్కన మద్యం దుకాణం ఏర్పాటు చేయడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీస నిబంధనలు పట్టించుకోకుండా ఎస్ఈబీ అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మద్యం దుకాణం ఎత్తి వేయాలంటూ డిమాండు చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. దుకాణం ఎత్తి వేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు ప్రకటించారు.
శ్రీకాళహస్తి పట్టణ శివారులోని బంగారమ్మకాలనీ వద్ద పిచ్చాటూరు ప్రధాన రహదారి పక్కనే చాలా ఏళ్లుగా నాగాలమ్మ గుడి ఉంది. మహిళలు ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. బంగారమ్మకాలనీ వాసులు ఇటీవలనే నాగాలమ్మ గుడికి సొంత ఖర్చులతో సొబగులు దిద్దారు.
ఇక ఇక్కడ ఆలయంతో పాటు నివాస గృహాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నాగాలమ్మగుడికి వంద మీటర్ల దూరం లోపే రెండు రోజుల కిందట ప్రభుత్వ మద్యం దుకాణం ప్రారంభించారు. దుకాణం పక్కనే నివాస గృహాలు ఉండటంతో ప్రజలకు ఆగ్రహం తెప్పించింది.
నిబంధనలు పాటించకుండా గుడి పక్కనే… నివాస గృహాల మద్యం దుకాణం ఎలా ఏర్పాటు చేస్తారంటూ అధికారులను నిలదీశారు. దుకాణం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియచేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వలన మహిళలకు రక్షణ లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్ఈబీ అధికారులతో వాదనకు దిగారు. అయినా ఫలితం దక్కలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మద్యం దుకాణం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని… తమ చేతుల్లో ఏమీ లేదని వారు తేల్చి చెప్పేశారు. అయిన మహిళలు నిరసన కొనసాగించడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమవంతు సహకారం అందిస్తామని ఎస్ ఈబీ అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన తాత్కాలికంగా విరమించారు.
ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి బంగారమ్మకాలనీలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వేరే చోటుకు మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
.