రాజీవ్ నగర్ కాలనీ కష్టాలు తీర్చాలంటూ ఆ కాలనీవాసులు బురద రోడ్ల వద్ద సీపీఎం నాయకులతో కలిసి సోమవారం నిరసన తెలిపారు.
తమ సమస్యలను సత్వరమే పరిష్కరించకుంటే పురపాలక సంఘాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు.
ఈ సందర్భంగా సిపిఎం తిరుపతి ప్రాంత జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ పట్టణానికి కూతవేటు దూరంలోనే రాజనగర్ ఉన్నా కాలనీ వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు.
కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలో రోడ్లన్నీ బురదమయమయ్యాయనీ, ఫలితంగా అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
దీంతో పాలు, నీరు, నిత్యావసర సరుకులు సరఫరా చేసే వాళ్ళు కాలనీలోకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా సుమారు వెయ్యి గడప ఉన్న ఈ కాలనీ నుంచి నిత్యం వందలాది మంది విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి వస్తుంటారనీ, బురద రోడ్లపై వెళ్ళలేక అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాలనీలో గత మూడు రోజులుగా వీధి లైట్లు వెలగడం లేదనీ, ఫలితంగా వర్షాకాలం పాములు, పురుగులు ఇళ్లలోకి చొరబడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని వాపోయారు.
రోడ్లు సరిగా లేకపోవడం వల్ల రేషన్ బండి కూడా కాలనీకి రావట్లేదనీ, కైలాసగిరి కాలనీకి వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మున్సిపల్ పైపులైన్ల నుంచి నిత్యం నీరు వృధాగా పోతుండటంతో రోడ్లు పాడువుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల రాజీవ్ నగర్ లో నిర్వహించిన గుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి కార్యక్రమంలో భాగంగా స్థానిక సమస్యలను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీసుకెళ్లినా కూడా ఇప్పటివరకు పరిష్కార మార్గం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి రాజనగర్ సమస్యలు సత్వరమే పరిష్కరించకుంటే పురపాలక సంఘాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
సిపిఎం పట్టణ బాధ్యుడు గంధం మణి, రాజీవ్ నగర్ కాలనీ వాసులు నాగమ్మ, ఎల్లయ్య, సురేష్, నిర్మల, ఇందు, అరులు, ఈశ్వరయ్య, పద్మ, ఉదయ్ పాల్గొన్నారు.
.