వేలాది మందికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చి.. మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్) కళాశాల కాల గర్భంలోకి కలిసి పోతోంది. ఈ నెల 31వ తేదీ నాటికి కళాశాల పూర్తిగా మూసి వేయాలని అధికారులు నిర్ణయించారు.
అన్ని శాఖల విభాగాధిపతులు కళాశాలలోని సామాగ్రి మొత్తం ఈ నెల 20వ తేదీలోగా ముక్కంటి ఆలయ అధికారులకు అప్పగించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్కిట్ కళాశాల ఉద్యోగులకు మంగళవారం నోటీసులు అందజేశారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా 1997-98 విద్యా సంవత్సరంలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించారు. మొదట ఈ కళాశాలల ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అనుమతించారు. ఒక్కొక్క కోర్సులో 60సీట్లు కేటాయించారు. ఆ తరువాత కొంతకాలానికి సివిల్ ఇంజనీరింగ్ కోర్సుకు కూడా అనుమతి వచ్చింది.

అప్పటి రాష్ట్ర మంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కృషి ఫలితంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఈ కళాశాల నిర్వహించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆరంభంలో ఈ కళాశాల శ్రీకాళహస్తి పట్టణంలోని కాసాగార్డన్ లో నడిపారు. ఆ తరువాత కొంతకాలానికి శ్రీరామనగర్ కాలనీకి కొద్ధి దూరంలో పూతలపట్టు- నాయుడుపేట ప్రధాన రహదారి పక్కనే సకల సౌకర్యాలతో 55 ఎకరాల విస్తీర్ణంలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మించారు.
ప్రస్తుతం ఈ కళాశాల ఆస్తుల విలువ రూ.700కోట్లు పైమాటే. రాష్ట్రంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఏకైక ఇంజజీరింగ్ కళాశాల కావడం.. బోధన బాగా ఉండటం.. మంచి ఫలితాలు వస్తుండటంతో అనతి కాలంలోనే స్కిట్ కు మంచి ఖ్యాతి వచ్చింది. ఎంతో దూరం నుంచి వచ్చి విద్యార్థులు ఈ కళాశాలలో చేరే వారు. విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతుండటంతో ప్రధాన బ్రాంచిల్లో అదనపు సీట్లు కూడా ఏఐసీటీఈ కేటాయించింది.

ఇక ఇదే కళాశాలలో డిప్లొమా కోర్సులకు సాంకేతిక విద్యాశాఖ అనుమతించింది. ఒక్కొక్క కోర్సులో 60మంది వంతున 240 సీట్లు కేటాయించారు. ఆ తరువాత కొంతకాలానికి ఇక్కడ ఒక్కొక్క కోర్సులో 18మంది వంతున ఉండే విధంగా ఎంటెక్ కు కూడా సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దీనిని బట్టి ఈ కళాశాల ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఆదాయం ప్రధానం కాకుండా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే ప్రధాన ఆశయంతో ఈ కళాశాల అప్పట్లో ఏర్పాటు చేశారు.
విద్యార్థుల నుంచి వచ్చే ఫీజుతోనే కళాశాల ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే విధంగా నిబంధన విధించారు. ముక్కంటి ఆలయం వారు మొదట కాషన్ డిపాజిట్ కోసం రూ.50 లక్షలు ఇచ్చారు. ఆ తరువాత కళాశాల నుంచి వచ్చే ఆదాయమే జీతాలకు, అభివృద్ధి పనులకు సరిపోయేది. 1997 నుంచి 2013 వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కళాశాల నిర్వహించారు.
also read : శ్రీకాళహస్తీశ్వరాలయ పనులు శివరాత్రిలోగా కొలిక్కి
అయితే 2013 నుంచి ఈ కళాశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గి పోవడం ప్రారంభమైంది. ముక్కంటి ఆలయ అధికారులు పట్టించుకోక పోవడం.. కళాశాలలో వర్గ రాజకీయాలు అధికం కావడం.. రాజకీయ జోక్యం మితిమీరడం వంటి కారణాలతో కళాశాల పతన దిశగా పయనించడం ప్రారంభమైంది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది. 2016 నవంబరు నాటికి అక్కడ పని చేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి ఏర్ఫడింది.
ఈ నేపథ్యంలో అప్పటి నుంచి స్కిట్ కళాశాల ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి ముక్కంటి లయం వారు ప్రతి నెలా రూ.25లక్షల వంతున చెల్లిస్తున్నారు. కళాశాల ఉద్యోగుల వేతనాల కోసం ఆలయం వారు ఇప్పటి వరకు రూ.14కోట్లు చెల్లించారు. ఈ భారం ఇక భరించలేమంటూ ముక్కంటి ఆలయ అధికారులు తమ సమస్యను రాష్ట్ర దేవాదాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కళాశాల పరిస్థితి పై నివేదిక సమర్పించాలని వారు ఆదేశించారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
వారి ఆదేశాల మేరకు ముక్కంటి ఆలయ అధికారులు నివేదిక సమర్పించారు. 2019-20 విద్యా సంవత్సరంలో పూర్తిగా అడ్మిషన్లు జరగలేదని… 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ మొదటి సంవత్సరంలో 15మంది.. డిప్లొమో కోర్సుల్లో 12మంది చేరినట్లు నివేదికలో పేర్కొన్నారు. చివరి సంవత్సరం విద్యార్థులు కోర్సులు ముగిసి పోయి బయటకు వెళ్లి పోతారని.. ఇక ద్వితీయ సంవత్సరానికి వచ్చే విద్యార్థులను వారి అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని సమీప కళాశాలల్లో చేర్చుతామని తమ నివేదికలో అధికారులు పేర్కొన్నారు.
ఆ తరువాత స్కిట్ కళాశాల భవితవ్యం నిర్ణయించడానికి గత నెల 25న రాష్ట్ర దేవదాయశాఖ కార్యాలయంలో గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గి పోవడం.. నిర్వహణ భారంగా మారడంతో కళాశాల శాశ్వతంగా మూసి వేయాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. దేవాదాయశాఖ ఆదేశాల మేరకు ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్ధిరాజు ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ కళాశాలలో 29మంది బోధన, 36మంది బోధనేతర ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ తరువాత వీరందరినీ ఇళ్లకు పంపనున్నారు. స్కిట్ ఇంజినీరింగ్ కళాశాల మూసివేత నిర్ణయంతో శ్రీకాళహస్తి ప్రాంత వాసులు మంచి విద్యాసంస్థను కోల్పోతున్నారు. కాగా కళాశాల మూసి వేయాలని నిర్ణయించడం.. ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడంతో.. తమకు న్యాయం చేయాలని డిమాండు చేస్తూ వారు ఆందోళనకు దిగారు.
స్కిట్ కళాశాల మూసివేతకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలను దిగువ చూడండి..


.