తొట్టంబేడు మండల మండల విద్యాశాఖలో అక్రమ బదిలీలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిన సాగుతున్నాయి. సదరు మండల విద్యాశాఖాధికారిణి తన మౌఖిక ఆదేశాలతో అంతర్గత డిప్యుటేషన్లు వేయడం పలు విమర్శలకు దారితీస్తోంది. గతంలో జిల్లా వ్యాప్తంగా అక్రమ డిప్యుటేషన్లు వేసారని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో వాటిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
అయితే తొట్టంబేడు మండలంలో మాత్రం అంతర్గత అక్రమ డిప్యుటేషన్లు యదేచ్ఛగా కొనసాగుతుండటం గమనార్హం. ఇందుకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే.. తొట్టంబేడు మండలం ఎగువసాంబయ్యపాలెంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ.. గొట్టిపూడి ప్రాథమిక పాఠశాల నుంచి ఒకరిని డిప్యుటేషన్ పై పంపారు.
అదేవిధంగా తంగేళ్లపాలెం ప్రాథమికోన్నత పాఠశాల నుంచి పెద్దగుంట పాఠశాలకు ఒక ఉపాధ్యాయినినీ…. పెద్దగుంట పాఠశాల నుంచి చియ్యవరం పాఠశాలకి ఒక ఉపాధ్యాయుడినీ.. చియ్యవరం పాఠశాల నుంచి తంగేళ్లపాళెం పాఠశాలకి ఒక ఉపాధ్యాయురాలిని మౌఖిక డిప్యుటేషన్లపై పంపారు.
సాధారణంగా పని సర్దుబాటు కొరకు డిప్యుటేషన్లు వేస్తుంటారు. అయితే అందుకు జిల్లా విద్యాశాఖాధికారి అనుమతి తప్పనిసరి. కానీ తొట్టంబేడు మండల విద్యాశాఖలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కేవలం మౌఖిక ఆదేశాలతో ఉపాధ్యాయుల స్వప్రయోజనాల కోసం డిప్యుటేషన్లు జరుగుతుండడటం విచారకరం.
ఒక ఉపాద్యాయుడు సెలవు కావాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే విద్యాశాఖాధికారులు… అంతర్గత డిప్యుటేషన్లను మాత్రం మరో ఆలోచన లేకుండా ఎవరి ప్రయోజనాలకోసం వేస్తున్నారో అధికారులకే తెలియాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండల విద్యాశాఖలో జరుగుతున్న అక్రమ బదిలీలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Discussion about this post