మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పార్టీ ప్రక్షాళన పనులను ప్రారంభించారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు. విశాఖ సౌత్‌కు గండి బాబ్జీ, మాచర్లకు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, విజయవాడ వెస్ట్ స్థానానికి ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేని నాని లను పార్టీ ఇన్చార్జిలుగా నియమించారు.
ఇప్పుడు నియమితులైన అసెంబ్లీ ఇన్చార్జులే వచ్చే ఎన్నికలకు పార్టీ తరఫున అభ్యర్థులు అని ఖరారుగా పార్టీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నాని.. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో ఉంటారని పలువురు భావిస్తున్నారు.
విజయవాడ వెస్ట్ స్థానాన్ని కేశినేని నానికి కేటాయించడంపై పార్టీలోనే కొందరిలో అసంతృప్తి రేగుతున్నప్పటికీ.. చంద్రబాబు అవేమీ ఖాతరు చేయలేదు. ఈ స్థానంపై బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలకు కన్నుంది. వారికి పార్టీలో ప్రస్తుతం ఇతర బాధ్యతలున్నాయనే నెపం చూపి, వారు ఆశించిన విజయవాడ వెస్ట్ స్థానం ఇవ్వలేదు. ఇప్పటిదాకా నియోజకవర్గంలో వారు నియమించిన పార్టీ కమిటీలను కూడా పూర్తిగా రద్దుచేసి.. కొత్తగా తనకు అనుకూలురైన కార్యకర్తలతో పార్టీ కమిటీలు వేసుకోవడానికి కూడా కేశినేని నానికి చంద్రబాబు నాయుడు అధికారం ఇచ్చారు.
ఈ నిర్ణయంతో.. కేశినేని నానిలో ఇటీవలి కాలంలో పార్టీ పట్ల ఏర్పడిన అసంతృప్తిని పూర్తిగా బుజ్జగించినట్లు అయింది. కొన్నాళ్ల కిందట ఇక రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టుగా కేశినేని నాని ఒక సంచలన ప్రకటన చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే బెజవాడ ఎంపీ స్థానం నుంచి మాత్రం మళ్లీ పోటీచేసే అవకాశమే లేదని ఆయన తెగేసి చెప్పేశారు. అయితే గియితే ఎమ్మెల్యే బరిలో ఉండడానికే ఇష్టపడ్డారు. దానికి తగ్గట్టుగానే చంద్రబాబునాయుడు ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఇన్చార్జి పదవి కట్టబెట్టారు.
పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కేశినేని నానే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారు. ఎంపీగా మరొక ప్రత్యమ్నాయం దొరకని పరిస్థితుల్లో.. ఇతర పార్టీ అవసరాలు మరో రకంగా కోరుకుంటే మాత్రం.. ఆయన కూతురు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఉంది. ఆమె ప్రస్తుతం విజయవాడలో కార్పొరేటర్ గా ఉన్నారు. మేయర్ పదవిపై కన్నేసి కార్పొరేటర్ గా గెలిచారు గానీ.. కల తీరలేదు.
పార్టీ ప్రక్షాళన గురించి కొంతకాలంగా చంద్రబాబునాయుడు సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు చేపట్టిన ఈ నియామకాలతో కసరత్తు ప్రారంభించినట్లే కనిపిస్తోంది. ఒకరిద్దరినుంచి రేకెత్తగల అసంతృప్తులను కూడా ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. చంద్రబాబునాయుడు ఈ దఫా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుండడం పార్టీకి కొత్త జవసత్వాలు ఇస్తుందేమో చూడాలి.
.

Discussion about this post