తెలిసో తెలియకో స్వామి వారి పట్ల జరిగే దోష నివారణార్థం.. పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం పుష్పయాగం వైభవం జరిగింది. సుగంధ పరిమళ భరితమైన పద్నాలుగు రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పయాగం నిర్వహించారు. వర్ణశోభితమైన పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత జేగీయమానంగా కనిపించింది.

తిరుమలేశునికి బ్రహ్మోత్సవాల సమయంలో అర్చకుల వల్లగానీ, ఇతరుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరిగింది. సంపంగి, సెంటు జాజులు, చామంతి, వృక్షి, పొగడ, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, తామర, కనకాంబరం, కలువ, మొగలిరేకులు, మాన్ సంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.
పుష్పాధిదేవుడు ‘పుల్లుడు’
పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్పయాగానికి మొత్తం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు నుండి 4 టన్నులు, కర్ణాటక నుండి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కలిపి ఒక టన్ను పుష్పాలు, పత్రాలను దాతలు అందజేశారు.
ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం
శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులును టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి శాలువతో ఘనంగా సన్మానించారు. జెఈవో పి.బసంత్‌కుమార్, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విజివో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ జగన్‌మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కథనాలు.. ఇవీ చదవండి : తుంగభద్ర అంటే.. ఆదివరాహస్వామి స్వేదం.. ఆ విశేషం మీకు తెలుసా? పుష్కరం అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పండుగ పుష్కరాల్లో ఎలాంటి పనులు చేయాలో తెలుసా? ఏయే నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసా?
.

Discussion about this post