‘అపకారికి ఉపకారము’ చేయాలని మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ప్రాక్టికల్‌గా అది సాధ్యమేనా? మన కీడు కోరేవాడు తారసపడినప్పుడు, కీడు కోరే వాడికి మన అవసరం ఏర్పడినప్పుడు మనం అతడికి అనుకూలంగా ఏనాడైనా స్పందిస్తామా? స్పందించగలమా? అంత ఉదాత్తమైన వైఖరి మనకు ఉంటుందా? అన్నీ ప్రశ్నలే!
కన్నుకు కన్ను అన్నట్టుగా అపకారికి అపకారం చేయడం మాత్రమే లోకం మెచ్చిన రీతి. మరో మార్గం అనుసరించడాన్ని చేతగానితనంగా భావిస్తుంటారు. మరీ అపకారం చేయాలనే ఉద్దేశం లేకపోయినా, చేయడం చేతకాకపోయినా.. అపకారిని విస్మరించి పక్కకు తప్పుకుని వెళ్లడం ఎక్కువ మంది చేసే పని. అయితే ‘అపకారికి ఉపకారము’ చేయడం మాత్రం అనూహ్యం. అలా చేయగల వాళ్లను వెతుక్కోవాలి.
కానీ, అపకారికి అపకారం చేయడం మనం లోక సహజంగా చెప్పుకుంటున్నాం గానీ.. ఫ్యాక్షనిస్టు అనే పెద్దపదంతో ఎవరినైతే నిందిస్తుంటామో వాళ్లు చేసేది అదే పని కదా. కనుక- ఆ తరహాలో ‘అపకారికి అపకారము’ చేయడం కరెక్టు అనుకునే మనందరిలోనూ ఓ ఫ్యాక్షనిస్టు దాగి ఉన్నట్టే. అందుకే అలా ఉండొద్దనే సంగతిని.. ఈ సుభాషితం ఈ విధంగా చెబుతుంది.
అరావప్యుచితం కార్యం ఆతిథ్యం గృహమాగతే
ఛేత్తుః పార్శ్వగతాం ఛాయాం నోపసంహరతే దుమః
శత్రువు అయినా సరే నీ ఇంటికి వచ్చినప్పుడు అతనిని సాదరంగా అతిథి లాగా గౌరవించాలి. ఎలాగంటే.. తనను నరకడానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడను ఇస్తుంది. వాడికి నీడలేకుండా చేయదు. -అనేది శ్లోకభావం.
‘అతి’ మంచితనం బోధించే సుభాషితం ఇది. నరకడానికి వచ్చిన వాడికి చెట్టు నీడ ఇస్తుంది గనుక.. మనకు కీడు తలపెట్టి శత్రువు వస్తే.. మనం వాడిని అతిధి దేవోభవ అంటూ సత్కరించడం సాధ్యమేనా? ఎప్పటికీ కాదు. మంచి వాళ్లకు- శత్రువుకు కీడు చేసే ఆలోచన లేకపోవచ్చు. అసమర్థులకు- శత్రువుతో తలపడే ఓపిక లేకపోవచ్చు. కానీ శత్రువు కీడు కోరి ఇంటికి వస్తే మర్యాదలు చేసేంత మంచితనం కష్టం.
కానీ.. అతి మంచితనం గురించి చెప్పే ఈ సుభాషితం నుంచి పరిమిత అర్థం మనం స్వీకరిస్తే గొప్పగా ఉంటుంది.
శత్రువు మన ఇంటికి రావడం అంటే.. కార్యార్థియై, మనతో అవసరం ఏర్పడి వచ్చినప్పుడు ఖచ్చితంగా అతనికి సహాయం చేయాలి. ఇలాంటి పని శత్రువును నిర్జించడం కాదు.. అతనిలోని శత్రుభావనను చంపేస్తుంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
శత్రుత్వం, మిత్రత్వం ఏవీ శాశ్వతంగా ఉండవు. శత్రువుగా మనం పరిగణించేవాడు.. మనతో పనిపడి మన చెంతకు వచ్చినప్పుడు.. పాత వైరం మొత్తం తిరగదోడి అవమానించడం చాలా సహజంగా జరిగే పని. అవేమీ పట్టించుకోకుండా.. అతనికి సాయం చేస్తే, అతని అవసరాన్ని తీరిస్తే మనపట్ల ప్రేమను పెంచుకుంటాడు.
వ్యక్తుల మీద సాధించగల నిజమైన విజయం ప్రేమ.
సుభాషితం మన ఆచరణకు పొసగనంత పెద్ద నీతిని చెప్పినా.. దాని పరిమితార్థంలో ఇలా అర్థం చేసుకుందాం.
శుభోదయం.
.

Discussion about this post