గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు పండించే రైతులకు టిటిడి ప్రోత్సాహం అందిస్తోందని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం టిటిడి చేపడుతున్న చర్యలు ఇలా ఉన్నాయి.
– రైతులు తమ పంటల కోసం రసాయనాలతో కూడిన ఎరువులు, పురుగుమందులు వాడడం ద్వారా ఆర్థికంగా చితికిపోవడంతో పాటు పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలుగుతోంది. పలువురు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇలాంటి రైతులను ఆదుకోవాలని టిటిడి నడుం బిగించింది.
– ఇందులో భాగంగా టిటిడికి అవసరమయ్యే ముడి సరుకుల్లో శనగలు, బెల్లం, దేశీయ ఆవునెయ్యి, బియ్యం లాంటివి గో ఆధారిత వ్యవసాయంతో పండించిన రైతుల నుంచి కొనుగోలు చేయడానికి అక్టోబరు 12న తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ, ప్రకృతి వ్యవసాయ శాఖలతో టిటిడి ఎంఓయు కుదుర్చుకుంది.
– గో ఆధారిత వ్యవసాయాన్ని మూడేళ్లు, రెండేళ్లు, ఒక సంవత్సర కాలంగా చేపడుతున్నరైతులకు ప్రాధాన్యతలవారీగా ఉచితంగా ఆవులు, ఎద్దులను టిటిడి అందిస్తోంది. వీటిని వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వినియోగించుకోవడం ద్వారా రైతులు ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు.
– అదేవిధంగా, వట్టిపోయిన ఆవులను కూడా రైతులకు అందిస్తుండడం ద్వారా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి వీటిని వినియోగిస్తున్నారు. ఈ విధానంలో పండించిన శనగలు, బెల్లం, దేశీయ ఆవునెయ్యి, బియ్యం తదితర సరుకులకు గిట్టుబాటు ధర చెల్లించి టిటిడి కొనుగోలు చేస్తుంది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పంట ఉత్పత్తులను తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కైంకర్యాలు, ప్రసాదాల తయారీ కోసం వినియోగిస్తారు.
– ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 638 దేశవాళీ పశువులను రైతులకు ఉచితంగా అందించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో 308 పశువులను అందించగా, వీటిలో 180 ఆవులు, 128 ఎద్దులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో 330 పశువులను అందించారు.
– రైతులు పండించిన పంట ఉత్పత్తులను మొదట ప్రకృతి వ్యవసాయ శాఖ మార్కెటింగ్ విభాగం సేకరిస్తుంది. పంట ఉత్పత్తులను నిల్వ ఉంచి ప్రాసెస్ చేసి ముడిసరుకులను అవసరాన్ని బట్టి టిటిడికి అందిస్తుంది.
.
Discussion about this post