విద్యా రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్.రాజశేఖర్ డిమాండు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో బుధవారం పీడీఎస్ యూ జిల్లా మూడవ మహాసభలు ఆ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జాకీర్ అధ్యక్షతన జరిగాయి.
ఈ మహాసభలకు రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ చేయడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన జాతీయ విద్యా విధానం 2020 పేరుతో విద్యను కాషాయీకరణ వైపు తీసుకెళ్తున్నారని ఆ రోపించారు. రాష్ట్రంలో 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయటం లేదన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనలకు వివిధ రకాల ఆంక్షలు పెట్టి విద్యార్థులకు ఆ పథకాలను దూరం చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో వందలాది అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయటం లేదన్నారు. ప్రైవేట్, కార్పోరేట్ కళాశాలలో విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు.
విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం పీడీస్ యూ చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని 13 మందితో ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా కె. ప్రదీప్, కార్యదర్శిగా S.జాకీర్, కోశాధికారిగా హేమంత్ తో పాటు 11 మంది సభ్యులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టీయూ జిల్లా కార్యదర్శి కె.రమేష్, పీడీఎస్ యూ నాయకులు సాయి, విక్కీ, హరీష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
.