ముక్కంటి ఆలయ అధికారుల తీరే వేరు. ఉద్యోగం ఒక చోట ఉంటుంది. విధులు వేరే చోట నిర్వహిస్తూ ఉంటారు. ఇందుకు కారణం రాజకీయం. ఇలా చేయడం వలన అసలు లక్ష్యం నెరవేరడం లేదు. దేవుడి సొమ్మూ వృథా అవుతోంది. పాలకులు మారినా.. ఈవోలు మారినా ఈ విభాగాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆలయ పాలనను శాసిస్తున్నారు. ఈ విషయం అధికారులకు, రాజకీయ నేతలకు తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నందనవనం, హరితాభివృద్ధి అనే విభాగాలు ఉన్నాయి. నందనవనంలో 22 మంది, హరితాభివృద్ధిలో 22 మంది ఉద్యోగులు ఉన్నారు. నందనవనంలో ఉన్న ఉద్యోగులు మొక్కలు నాటడం.. వాటికి నీరు పోసి సంరక్షించడం చేయాలి. హరితాభివృద్ధి విభాగంలో పని చేసే ఉద్యోగులు కైలాసగిరుల్లో ఉన్న చెట్లు నాశనం కాకుండా పర్యవేక్షించడం.. అగ్నికి ఆహుతి కాకుండా చూడటం చేయాలి.
నిబంధనల ప్రకారం ఏ విభాగంలో ఉన్న వారు ఆ విభాగంలోనే పని చేయాలి. అయితే ముక్కంటి ఆలయంలో అలా చేయడం లేదు. ఈ రెండు విభాగాలకు చెందిన వారు రాజకీయ పలుకుబడిలో ఆలయం లోపలే డ్యూటీలు వేయించుకుంటున్నారు. ఇందులో కొందరు దళారుల అవతారం ఎత్తి దేవుని సొమ్ముతో జేబులు నింపుకుంటున్నారు. చాలా ఏళ్ల తరబడి ఆలయంలోనే ఉంటున్నారు.
వీరిని కదలించడానికి ఈవోలు ప్రయత్నిస్తే.. వారికి రాజకీయ ఒత్తిళ్లు వస్తాయి. ఈ విభాగాల్లో పని చేసే కొందరు ఆలయ పాలనను శాసించే స్థాయిలో ఉన్నారంటే వారి పలుకుబడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరు విధులు ఎక్కడ నిర్వహిస్తే మీకేంటి? అనే అనుమానం మీకూ రావచ్చు. ఇందుకోసం మీకు చిన్న ఉదాహరణ చెబుతా. చదవండి.
ముక్కంటి ఆలయ ప్రాంగణం.. లోబావి ప్రాంతాలను హరితమయం చేయాలనే ఉన్నతాశయంతో కొంతకాలం కిందట వివిధ రకాల మొక్కలు నాటారు. ఇందులో కొన్నింటిని కుండీల్లో ఉంచారు. మొక్కల పెంపకం కోసం రూ.లక్షల్లో వెచ్చించారు. మొక్కలకు నీరు పోయాల్సిన బాధ్యత నందనవనం విభాగంలో పని చేసే సిబ్బందిది. అయితే వీరంతా ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్నందున మొక్కలకు నీరు పోసే నాథుడే కరువయ్యారు.
ఫలితంగా కుండీల్లోని మొక్కలు నిలువునా ఎండి పోతున్నాయి. ఆలయ ప్రాంగణం, భరద్వాజ తీర్థం (లోబావి)లో ఉన్న మొక్కల నిర్వహణ బాధ్యత చేసే వారు లేక పోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. అధికారులకూ ఈ విషయం తెలుసు. మొక్కలు నిలువునా ఎండి పోతున్న విషయం అధికారుల కళ్లకూ కనపడుతున్నాయి. అయినా నందనవనం సిబ్బందికి ఈ పనులు అప్పగించ లేక పోతున్నారు.
ఫలితంగా మొక్కలు ఎండిపోయి ఆశయం నీరు గారి పోతోంది. పైకి మాత్రం లోబావిని హరితమయం చేస్తామని అధికారులు ప్రగల్బాలు పలుకుతుంటారు. ఆచరణలో చూస్తే ఇలా ఉంది. వీరి తీరు కారణంగా ముక్కంటి సొమ్ము వృథా అవుతోంది. అధికారులు ఇకనైనా స్పందించి మొక్కలకు నీరు పోసి కాపాడాల్సి ఉంది. ఏం చేస్తారో చూద్దాం.
.