శ్రీకాళహస్తి రేంజ్ కెవిబి పురం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 19 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఐదుగురు స్మగ్లర్లు ను అరెస్ట్ చేసి, ఎర్రచందనం రవాణా కు ఉపయోగిస్తున్న రెండు ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్ ఈ బి డైరెక్టర్ ఆవుల రమేష్ రెడ్డి సూచనలతో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాలు మేరకు డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి కి చెందిన ఆర్ ఎస్ ఐ విశ్వనాధ్ టీమ్ శుక్రవారం నుంచి శ్రీకాళహస్తి నుంచి కెవిబి పురం వైపు గల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.
శనివారం ఉదయం రాగిగుంట సెక్షన్ కొండల ఆదవరం సమీపంలో ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తున్న వ్యక్తులను గమనించి వారిని చుట్టుముట్టారు. వారి నుంచి 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
వారిని కెవిబి పురం మండలానికి చెందిన పండేటి రామయ్య (27), ఆదూరు గోపాల్ (21), భీరం శేఖర్ (27), తొట్టంబేడు మండలానికి చెందిన ఆంబోతుల కృష్ణయ్య (60), నిండ్ర మండలానికి చెందిన మావిళ్ళ శ్రీనివాసులు (32)లుగా గుర్తించారు.
వీరిని అరెస్ట్ చేసి ఎర్రచందనం అక్రమ రవాణా కు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సిఐ రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, ఆర్ ఎస్ ఐ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.
.