శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు సక్రమంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజును కలసి వినతిప్రతం సమర్పించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు ఖ్యాతి గాంచిదన్నారు. ఇక్కడ దోష పూజలు చేసుకోవడానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని చెప్పారు. అలాంటి పూజలకు నాగపడగల కొరత రావడం బాధాకరమన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందన్నారు.
నాగపడగలు లేక సోమవారం రాహు-కేతు పూజలు రెండు గంటలు పైగా ఆగి పోయాయన్నారు. మంగళవారం కూడా ఇదే సమస్య పునరావృతం అయినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఆలయ ఈవో పెద్దిరాజు దృష్టికి తీసుకొచ్చారు.
మహాశివరాత్రి పండుగ రోజున ముక్కంటి ఆలయంలో అంతా తమదేనంటూ నానా యాగీ చేసిన నేతలు నాగపడగలు తక్కువ వచ్చి.. రాహు-కేతు పూజలు ఆగి పోతే ఎందుకు మాట్లాడటం లేదని వారు ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
భక్తులు మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉందన్నారు. నాగపడగల కొరతకు కారణమైన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యుక్షులు విజయకుమార్, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి వారి గురవారెడ్డి, తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, పార్లమెంట్ యస్ టి సెల్ అధ్యక్షులు సుబ్బయ్య, పార్లమెంట్ ముస్లిం ప్రధాన కార్యదర్శి జిలానీ భాష, పార్లమెంట్ నాయకులు రంగినేని చెంచయ్య నాయుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మిన్నల్ రవి, పార్లమెంట్ నాయకులు ప్రకాష్ నాయుడు, తెలుగుయువత రాష్ట్ర నాయకులు ప్రతాప్, ప్రసాద్ నాయుడు, షాకీరాలీ, తెలుగుయువత నాయకులు కిట్టు, వినయ్, తెలుగు మహిళలు సుమతి, దుర్గ, అస్మత్, కృష్ణమనాయుడు, సన్నీ, సాయి, ఖాదర్, ఆర్ముగం, రమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.