చిత్తూరు జిల్లాలో అత్యధికంగా మామిడి పంట సాగు అవుతోందని , సరైన యాజమాన్య పద్ధతులను ఉపయోగించుకుని తక్కువ రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు ఉపయోగించి ఎక్కువ లాభాలు పొందేలా చూడాలని ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
ఆదివారం నాడు చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ మరియు రైతు ఉత్పత్తి దారుల సహకార సంఘం ఆధ్వర్యంలో మామిడి లో సస్యరక్షణ చర్యలు మరియు పెట్టుబడి తగ్గింపుపై అవగాహన సదస్సును స్థానిక విజయదుర్గ కళ్యాణ మండపంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ ప్రస్తుతం ఎకరానికి 25 వేల రూపాయల వరకూ రైతులు ఖర్చు పెట్టడం జరుగుతుందని అలా కాకుండా తక్కువ ఖర్చులో వచ్చే సేంద్రీయ ఎరువులను, ప్రకృతిలో పండించే పంటల ద్వారా వచ్చే క్రిమిసంహారక మందులను వాడటం ద్వారా తక్కువ ఖర్చు తో పాటు ఎక్కువ నాణ్యత గల పంటలను పొందవచ్చునని అన్నారు.
మామిడి లో పూత రాలేదని అందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలకన్నా ఎక్కువ మోతాదులో క్రిమిసంహారక మందులు వాడడం వల్ల ఎగుమతులకు ఇబ్బంది కలుగుతోందని, అలా కాకుండా సేంద్రియ ఎరువులు వాడటం ద్వారా నాణ్యత తో కూడిన పంటను పొందడంతో పాటు ఇతర దేశాలకు పంపడానికి వీలుగా ఉంటుందని ,రైతులకు మంచి ఆదాయం కూడా లభిస్తుందని అన్నారు.
బ్రెజిల్ ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఒక ఎకరా పొలం నుంచి 15 టన్నుల వరకు నాణ్యత గల ఉత్పత్తిని పొందుతున్నారని మన వద్ద నాలుగు టన్నులకు మించి ఉత్పత్తి సాధించలేకపోతున్నామన్నారు. ప్రస్తుతం మామిడి పూత కు సిద్ధంగా ఉందని ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి క్రిమిసంహారక మందులు స్ప్రే చేయకూడదని ఆయన అన్నారు. పూత దశలో ఏదైనా వ్యాధులు వస్తున్నాయని తెలుసుకున్నట్లయితే వేప నూనెను వాడాలని అన్నారు.
ప్రస్తుతం జిల్లాలో మంచి వర్షాలు కురవడం వల్ల చెట్లకు ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదని, ఈ సంవత్సరం నాణ్యతగల పంటను తీస్తారని ఆశిస్తున్నామన్నారు. ఉద్యానవన శాఖ ఉపసంచాలకులు శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1.17 లక్షల హెక్టార్లలో మామిడి పంట సాగు అవుతోందని సుమారు 80 వేల హెక్టార్లలో తోతాపురి రకం సాగుఆవుతుందని , ఈ రకం మామిడిని జిల్లాలోని 28 గుజ్జు పరిశ్రమల ద్వారా గుజ్జు తయారు చేయడం జరుగుతుందని అన్నారు.
మొత్తం మామిడిలో 7 లక్షల టన్నుల వరకు తోతాపురి రకం ఉంటుందని ఆయన అన్నారు. గత సంవత్సరం కొంత మాత్రమే ఎగుమతి చేయడం జరిగిందని ఇందుకు కారణం మామిడి లో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటమే అని అన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ మామిడి పంట ఉత్పత్తికి ఖర్చులు తగ్గించాలని, అదేవిధంగా ఎరువుల వాడకం కూడా తగ్గించే విధంగా మామిడి రైతుల లో అవగాహన కల్పించాలని ఆదేశించడం జరిగిందని ఆ మేరకు ఈ అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ మామిడి పంటకు ప్రధానంగా సేంద్రీయ ఎరువులు ఉపయోగించి, క్రిమిసంహారక మందుల ఉపయోగాన్ని తగ్గించుకోవాలని అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు అధికం కావడంతో ప్రస్తుతం ఎటువంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదని క్రిమిసంహారక మందుల వాడకంలో నాణ్యత గల ఎరువులను అధికారుల పరిశీలన తర్వాత ఉపయోగించాలని , ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు రైతులకు అవకాశం ఉంటుందని అన్నారు.
జీవన ఎరువుల శాస్త్రవేత్త రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జీవన ఎరువులు వాడటం ద్వారా మొ క్కలు ఆరోగ్యంగా పెరుగుతాయని, భూసారం పెరిగి మంచి ఉత్పత్తులు వచ్చేందుకు వీలవుతుందని అన్నారు. సేంద్రియ ఎరువులు వాడటం ద్వారా నాణ్యత గల ఉత్పత్తులు రావడం జరుగుతుందని ,అదేవిధంగా క్రిమిసంహారక మందుల విషయంలో సాధారణంగా మనకు లభించే,మనం తయారు చేసుకునే వాటిని ఉపయోగించుకోవాలని, దానిద్వారా ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవచ్చని అన్నారు.
క్రిమిసంహారక మందుల స్థానంలో ఆవుపేడ, నెయ్యి, పాలు, గోమూత్రం మరియు వేప నూనె లాంటివి ఉపయోగించాలని ,దీని ద్వారా ఖర్చులు భారీగా తగ్గుతాయని, నాణ్యమైన ఉత్పత్తులను పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు శాస్త్రవేత్తలతో తమ సమస్యలను, తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. పలువురు మామిడి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Discussion about this post