రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వారి సూచనల మేరకు జిల్లాలో గురు, శుక్రవారాలలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున మండల, మున్సిపల్ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులను అప్రమత్తం చేశామని, ఎవ్వరూ వారి హెడ్ క్వార్టర్ ను వదిలి వెళ్ళడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఇప్పటి వరకు సాధారణం కంటే అధిక శాతం వర్షపాతం నమోదైన కారణంగా చెరువులు, కుంటలు నిడిపోయాయని, ఇప్పుడు పడుతున్న వర్షాల కారణంగా చెరువులు, కుంటల్లో నీరు ఉదృతంగా ప్రవహిస్తోందని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముందుగానే జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. చెరువులు, లోతట్టు ప్రాంతాలకు రాకపోకలను నిషేదించడమైనదని, ఈ ప్రాంతాలలో గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ లను అప్రమత్తం చేయడం జరిగిందని, ప్రజలెవరూ ప్రమాదకరంగా ఉధృతంగా ప్రవహిస్తున్న చెరువులను, కుంటలు, నదులను దాటే ప్రయత్నం చేయరాదని, కాజ్ వేలన్ని అలెర్ట్ చేశామని తెలిపారు.
జిల్లాలో 4 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, లోతట్టు ప్రాంతాలలోని దాదాపు 300 మందిని పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని తెలిపారు. అవసరమైతే మరికొన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
గురు, శుక్రవారాలలో జిల్లా పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ వారి సేవలను వినియోగించుకుని ప్రజలకు సహాయక చర్యలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
.