ఆన్ లైన్ మోసాల్లో ఇదొక కొత్త తరహా. లాటరీలు, ఇతర తాయిలాలు కాదు. ఎల్ఐసీ పాలసీ వేసుకున్న వ్యక్తికి ఫోనుచేసి మాటలతో బురిడీ కొట్టించారు.. సైబర్ కేటుగాళ్లు. ఏకంగా ఇరవై లక్షలు దోచేశారు. చిత్తూరు పోలీసులు విడిచిపెట్టలేదు. ఢిల్లీ సమీపం నోయిడా దాకా వెళ్లి.. నిందితుడిని కటకటాల్లోకి పట్టుకొచ్చారు.
దేశంలోనే అత్యధికంగా జరుగుతున్న నేరాల్లో సైబర్ నేరాలది అధిక భాగం. ఎక్కడో ఒకచోట కూర్చొని ఫోన్ ద్వారా అమాయక ప్రజలతో మాటలు కలిపి.. వారిచేత నగదును ఆన్ లైన్ ద్వారా దోచుకోవడంలో సైబర్ నేరగాళ్లు ఆరితేరారు.
ఈ తరహాలో చిత్తూరులో చోటుచేసుకున్న సైబర్ క్రైమ్ పై చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టీం రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఉన్న సైబర్ నేరస్తుడిని పట్టుకొని కటకటాల్లోకి పంపారు. ఈ సందర్భంగా చిత్తూరు టూ టౌన్ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి అరెస్ట్ ను చూపారు.
కేసు నేపథ్యం
చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు నగరం దుర్గా నగర్ కాలనీకి చెందిన సందీప్ కిషోర్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసి మధ్యలోనే నిలిపేశారు. ఇది గుర్తించిన సైబర్ నేరగాళ్లు సందీప్ కిషోర్ కు ఫోన్ చేసి.. తాము ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, నిలిపివేసిన ఇన్సూరెన్స్ పాలసీలకు తాము 35 లక్షల రూపాయలు చెల్లిస్తామని.. ఇందుకోసం జీఎస్టీ చెల్లించాలని కోరారు.
వారి మాయమాటలు నమ్మి పలుమార్లుగా సందీప్ కిషోర్ 20 లక్షల రూపాయలు చెల్లించి మోసపోయారు. సందీప్ కిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి.. సైబర్ క్రైమ్ చేసిన నోయిడాకు చెందిన శైలేంద్ర సింగ్ ను చిత్తూరు టు టౌన్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.
అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే గుడ్డిగా నమ్మి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించి మోసపోవద్దని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి సూచించారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు టూ టౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్ పాల్గొన్నారు.
Discussion about this post