త్రిగుణాలు అనగానే కాస్త పురాణపరిచయం ఉన్న వారికి కృష్ణపరమాత్ముడు గుర్తుకొస్తాడు. చేయవలసిన పని చేయడం కోసం.. అర్జునుడికి ప్రేరణ ఇవ్వడానికి సుదీర్ఘంగా చెప్పిన భగవద్గీతలో ఆయన త్రిగుణాలను ప్రముఖంగా ప్రస్తావిస్తాడు. సత్వ రజ తమోగుణాలు అవి. కానీ.. వ్యక్తి జీవిత వికాసానికి గాడిద నుంచి నేర్చుకోవాల్సిన త్రిగుణాలు వేరే ఉన్నాయి.
వ్యక్తిత్వ వికాసం అనగానే.. మనకు అందరూ చెప్పే పాఠాలు ఆశావహ దృక్పథం బిగ్ డ్రీమ్స్ లాంటివి. దీనికి వాళ్లు బోలెడు బోలెడు ఉదాహరణలు కూడా చెబుతుంటారు. వాళ్లు చెప్పే ఉదాహరణలు కూడా చాలా ఉదాత్తంగా.. ఉంటాయి కూడా. అయితే ఎవ్వడూ గాడిదను ఎగ్జాంపుల్ గా తీసుకుని.. మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోండి అనే మాట చెప్పడు గాక చెప్పడు. ఎందుకంటే గాడిదంటే మనకు ఒక రకమైన చులకన.
ఇవాళ్టి రోజుల్లో గాడిద అసలు కనిపించడమే లేదు. అంతరించిపోయే జాతుల్లోకి చేరిపోయిందంటే అతిశయోక్తి కాదు. పిల్లలకు గాడిదను చూపించాలన్నా సరే.. మనం జూకు తీసుకువెళ్లాల్సిందే. అడ్డ గాడిదా అనే తరహా తిట్లు కూడా అంతరించిపోయాయి.
అయితే సనాతనంగా మనకు మంచిమాటలు చెప్పే పంచతంత్రం మాత్రం గాడిదనుంచి నేర్చుకోవాల్సిన విషయాలను కూడా చాలా చక్కగానే వివరించింది. ఆ శ్లోకం చూద్దాం.
అవిశ్రామం వహేద్భారం శీతోష్ణం చ స విన్దతి ।
ససన్తోషస్తథా నిత్యం త్రీణి శిక్షేత గర్దభాత్ ॥
– పంచతంత్రం
విశ్రాంతి అవసరమే లేకుండా పనిచేస్తుంది. బరువులను మోయడానికి వెనకాడకుండా ఉంటుంది. శీతోష్ణాలని అస్సలు లెక్క చేయకుండా పనిచేస్తుంది. అది ఆ విధంగా ప్రతి రోజూ సంతోషంగా ఉంటుంది. ..అంటూ పంచతంత్రం రచయిత గాడిద లక్షణాలని వివరిస్తాడు. ఈ మూడు లక్షణాలని మనం గాడిద నుండి కూడా నేర్చుకోవలసిన అవసరం ఉందని అంటాడు.
ఒక రకంగా చూస్తే భగవద్గీతా సారంలోని ఒక మాటకి.. అదనంగా మరో విషయం కూడా గాడిదలో మనకు కనిపిస్తుంది.
శీతోష్ణ సుఖ దుఃఖాలను సమంగా చూడాలని కృష్ణుడు పదేపదే చెబుతుంటాడు గీతలో. కానీ అవిశ్రాంతంగా పనిచేయాలని చెప్పినట్టు లేదు. బహుశా, ఆయన రాజ్యం కోసం పోరాడుతున్న వాడికి, రాజ్యపాలనాధికారం కోసం ఆరాటపడుతున్న వాడికి హితబోధగా గీతను చెప్పాడు గనుక.. ఆ జోలికెళ్లినట్టు లేదు. ఒకసారి యుద్ధం గెలిచి రాజ్యం దక్కితే.. రాజులకు ఓపినంత సమయం విశ్రాంతిలోనే గడచిపోతుంది కదా అనే భావన కూడా ఉండేదేమో.
కానీ మనం మన వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుకునేప్పుడు, అత్యంత సామాన్యమైన స్థితినుంచి ఉన్నతిని ఆశించేప్పుడు, కడు పేదరికం నుంచి స్థిమితమైన జీవితంవైపు అడుగులు వేయాలని అనుకుంటున్నప్పుడు విశ్రాంతిని కూడా మరచిపోవాలనే భావాన్ని మనం ఈ సుభాషితంలో తీసుకోవాలి.
అవిశ్రాంతం- విశ్రాంతి లేకుండా పనిచేయాలి.
వహేద్భారం- బరువుల్ని మోయడానికి, కష్టనష్టాల్ని భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి.
శీతోష్ణం- ఇది చెప్పుకున్నదే. లెక్కచేయకుండా సాగాలి.
ఈ మూడు గుణాలనూ కలిగిఉన్నది గనుకనే గాడిద కూడా నిత్యం సంతోషంగా ఉంటుంది అని భావం. గాడిద అనే పదాన్ని నెగటివ్ గా తీసుకోకుంటే.. మనకు ఇందులోని మర్మం చక్కగానే బోధపడుతుంది. గాడిద అనే పదం తిట్టుగా మన వాడుకలో ముద్రపడిపోయింది గనుక.. దాని నుంచి నేర్చుకోవడాన్ని చులకనగా భావించకపోతే.. కష్టనష్టాలకు వెరవని, విశ్రాంతిని కూడా కోరుకోని, సుఖదుఃఖాల పట్ల సమంగా స్పందించే ఏ వ్యక్తి అయినా.. ఖచ్చితంగా..తాను టార్గెట్ చేసే సంతోష స్థితిని చేరుకుంటాడు.
గొప్ప గొప్పవారి జీవితాలు, highly effective people జీవితాలు, గొప్పగొప్ప సంఘటనలు ఇవన్నీ చూసి బోలెడన్ని నేర్చుకుంటాం.. ఓసారి గాడిదనుంచి కూడా కొంత నేర్చుకుంటే తప్పేముంది.?
ఇవి కూడా చదవండి :
సినిమా ఇండస్ట్రీలో అరాచక విశృంఖలపోకడలపై సీనియర్ జర్నలిస్ట్ ‘రామ్’బాణం
వేదనలో సమంత.. లొకేషన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న వైనం
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
.

Discussion about this post