జంగమయ్య సన్నిధిలో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దేవదాయశాఖ కమిషనరు ఉత్తర్వులకూ దిక్కు లేకుండా పోయింది. టెండరు రద్దు చేయాలని కమిషనరు ఆదేశించినా.. కాంట్రాక్టరుకు ముక్కంటి ఆలయ అధికారులు అండగా నిలిచి తమ స్వామి భక్తి చాటుకుంటున్నారు.
ముక్కంటి సాక్షిగా కాంట్రాక్టరు భక్తులను దోచుకు తింటున్నప్పటికీ అడిగే నాథుడే కరువయ్యారు. ఇదే అదనుగా ఆయన అందినంతా దోచుకు తింటున్నాడు. అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయం లోపలకు సెల్ ఫోన్లు, కెమెరాలు, లగేజీ, పాదరక్షలు అనుమతించరు. వీటిని ఆలయ ప్రాంగణంలోనే భద్ర పరచడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
కౌంటర్ల నిర్వహణ బాధ్యత టెండరు ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. రెండేళ్ల కిందట ఈ టెండరును ఓ కాంట్రాక్టరు రూ.1.08 కోట్లకు దక్కించుకున్నాడు. ఈ కౌంటర్లలో కెమెరాకు రూ.10లు, సెల్ ఫోన్ కు రూ.5లు, లగేజీకి రూ.5లు, పాదరక్షలకు రూ.5వంతున కాంట్రాక్టరు వసూలు చేసే విధంగా నిబంధన విధించారు.
అపుడు కాంట్రాక్టరు ఈ నిబంధనల మేరకే భక్తుల నుంచి వసూలు చేసే వాడు. ఆ తరువాత కొవిడ్-19 ఫలితంగా భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గి పోవడంతో కొంతకాలం పాటు ముక్కంటి ఆలయం వారే ఈ కౌంటర్ల నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. అప్పట్లో ఆలయం వారు భక్తులకు ధరలు తెలిసే విధంగా కౌంటర్ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
కొవిడ్ తగ్గు ముఖం పట్టడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ కౌంటర్ల నిర్వహణ కోసం ఆలయం వారు ఇటీవల మళ్లీ టెండర్లు నిర్వహించారు. ఈ టెండరును శ్రీకాళహస్తి అధికార పార్టీకి చెందిన ఓ నేతకు రూ.78.50లక్షలకు అప్పగించారు.
గతంలో కంటే సుమారు రూ.22లక్షలు తక్కువకు టెండరు అప్పగించడంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన దేవాదాయశాఖ కమిషనరు ఈ టెండరును నెల రోజుల కిందట రద్దు చేశారు.

తదుపరి టెండరు నిర్వహించే వరకు ఆలయం వారే ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అయితే టెండరు దక్కించుకున్న అధికార పార్టీ నేత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సెల్ ఫోన్ కౌంటర్లు తానే నిర్వహించుకునే విధంగా న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
ఇందుకు కొంతమంది ఆలయ అధికారులే ఆయనకు సహకరించారనే ఆరోపణ బలంగా ఉంది. ఈ కథ ఇలా ఉంచితే… ఈ కాంట్రాక్టరు టెండరు నిబంధనలు తుంగలో తొక్కి భక్తుల నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.
ఇందుకు కారణం ఆయన అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడమేనని అంటున్నారు. ఈ కౌంటర్ల వద్ద ఆలయం వారు ఏర్పాటు చేసిన ధరలు తెలియ చేసే సూచిక బోర్డులు తొలగించారు. సెల్ ఫోన్ కు రూ.10, లగేజీకి రూ.10, పాదరక్షలకు రూ.10, కెమెరాకు రూ.30 వంతున వసూలు చేస్తున్నారు.
దూర ప్రాంతాలకు చెందిన భక్తుల వద్ద అయితే మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారనే ఆరోపణ ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముక్కంటి ఆలయ అధికారులకు ఈ విషయం తెలిసినా… సదరు కాంట్రాక్టరుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ముక్కంటి ఆలయ అధికారులు ఇకనైనా స్పందించి ఈ దోపిడీని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
.