కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రతరం చేసిందని అందులో భాగంగానే 44 కార్మిక చట్టాలను తుంగలో తొక్కిన ప్రధాని మోడీ దేశంలోని కార్మిక వర్గానికి క్షమాపణలు చెప్పాలని ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ డిమాండ్ చేశారు. ఈనెల 28, 29 తేదీలలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ రూపొందించిన గోడ పత్రికను శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు, రక్షణ కోసం రెండు రోజులపాటు అపూర్వమైన సమ్మెకు కార్మిక వర్గం పిలుపునిచ్చిందని చెప్పారు. 44 కార్మిక చట్టాలను తుంగలో తొక్కి తీసుకువచ్చిన 4 లేబర్ ఆర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం ఇవ్వాలని, జిఓ నెంబర్ 21ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిఎఫ్ పై వడ్డీరేట్లను తగ్గించరాదని ఇతర డిమాండ్ల కోసం జరుగనున్న సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు పాల్గొనబోతున్నారని చెప్పారు.
నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించి తమ ఇష్టం వచ్చినట్లుగా చట్టాలు చేయవచ్చని, ప్రజలపై భారాలు మోపచ్చని మోడీ ప్రభుత్వం భావిస్తోందన్నారు. దీనిని ఏమాత్రం సహించేది లేదని కార్మిక వర్గం కన్నెర్ర చేయబోతోందని తెలిపారు. ఈ సమ్మెలో ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, రైతులు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపు నిచ్చారు.
అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పి.వెంకటరత్నం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తోందని అన్నారు. రాజధాని ఢిల్లీలో రైతులు మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచినట్లుగా కార్మికులు సైతం కేంద్రానికి సరైన గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సార్వత్రిక సమ్మెకు రైతు కూలీ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తోందని చెప్పారు
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు పి.లోకేష్, ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ ఫెడరేషన్ తిరుపతి కార్యదర్శి కుడుం విజయ్ కుమార్, పి డి ఎస్ యు జిల్లా కన్వీనర్ మహేష్, తిరుపతి హాకర్స వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏ వి రమణ, ఆశ వర్కర్స్ ఫెడరేషన్ తిరుపతి నగర అధ్యక్షురాలు లక్ష్మీ కళ, మెటర్నిటీ హాస్పిటల్ హౌస్ కీపింగ్ వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు దేవి, దీప, తదితరులు పాల్గొన్నారు.
.