కన్నబిడ్డ ఆచూకీ కోసం ఓ తండ్రి నిద్రాహారాలు మాని నిరీక్షిస్తున్నాడు. ఒక రోజు కాదు… రెండు రోజులు కాదు. సుమారు ఆరు నెలలుగా ఆయన నిరీక్షణ. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ఆచూకీ కోసం ఎదురు చూసి… ఎదురు చూసి ఆ తండ్రి మానసికంగా… శారీరకంగా కుంగి పోతున్నాడు. తన బిడ్డ ప్రాణాలతో ఉందో… లేదోనని కుమిలి పోతున్నాడు. పోలీసులు ఫిర్యాదు చేసి ఐదు మాసాలు దాటినా వారు పట్టించుకోలేదని ఆయన వాపోతున్నాడు.
ఇందుకు సంబంధించి బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన ఎం. వరదయ్య కుమార్తె ప్రియాంక(19) అనే యువతి శ్రీకాళహస్తిలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ మధ్యలో చదువు ఆపేసింది. అప్పటి నుంచి ఆ యువతి తన స్వగ్రామమైన పూడిలో ఉండేది. ఈ ఏడాది జూలై 1న ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది.
ఆ యువతి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లతో పాటు… పలు ప్రాంతాలో వెతికారు. అయినా ప్రియాంక ఆచూకీ తెలియక పోవడంతో అదే నెల 3వ తేదీన తొట్టంబేడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రియాంక తండ్రి వరదయ్య ఫిర్యాదు మేరకు తొట్టంబేడు పోలీసులు (ఎఫ్ ఐ ఆర్: 159/2021) కేసు నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ తరువాత ఆ యువతి ఆచూకీ కనుగొనడంలో విఫలమయ్యారు.
ప్రియాంక తండ్రి మాత్రం నిత్యం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. తిరుపతి అర్బన్ స్పీ వెంకట అప్పలనాయుడును కూడా పలు పర్యాయాలు కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఆయన అయితే వరదయ్యకు భరోసా ఇచ్చారు కానీ… ఆచరణలో బాధితునికి ఇంతవరకు న్యాయం జరుగలేదు. కొంతకాలం కిందట నెల్లూరు నగరం వనంతోపు ప్రాంతానికి చెందిన నెలటూరు హరి అనే యువకుడు మార్బల్ వ్యాపారం చేయడానికి తన గ్రామానికి వచ్చాడని… అతడు సుమారు రెండు నెలల పాటు పూడిలో ఉన్నాడని.. ఆ యువకుడే తన కుమార్తె ప్రియాంకను కిడ్నాప్ చేశాడన్నది వరదయ్య ఆరోపణ.
అతనితో పాటు మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు పైన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వరదయ్య అనుమానం వ్యక్తం చేసే నెలటూరు హరికి ఇప్పటికే వివాహమైంది. అతనిపై ఇఫ్పటికే పోలీసు కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి నేర చరిత గల హరి తన కుమార్తెను ఏం చేశాడోనని వరదయ్య విలపిస్తున్నాడు. హరి చిరునామా చెప్పినా.. అతనిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని బాధుతుడు ఆరోపిస్తున్నాడు.
తాము పేద కుటుంబానికి చెందిన వారం కాబట్టే పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వరదయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డబ్బు, పలుకుబడి ఉన్న వారికైతే పోలీసులు ఇలా చేస్తారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. నేరచరిత కలిగిన నెలటూరు హరి తన బిడ్డను ప్రాణాలతో ఉంచాడో… లేదోనని ఆయన ఆందోళన చెందుతున్నాడు. తన బిడ్డ ప్రాణాలతో ఉంటే కనీసం ఒక్కసారైనా తనకు ఫోన్ చేసేదని ఆయన అంటున్నాడు.
పోలీసులు మనస్సాక్షిగా కేసు విచారణ చేస్తే తన కుమార్తె విషయం వెలుగులోకి వస్తుందని ఆయన అంటున్నాడు. పోలీసులు ఇకనైనా స్పందించి ప్రియాంక ఆచూకీ కనుగొనడానికి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. బిడ్డ ఆచూకీ తెలియక పోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని వరదయ్య అంటున్నాడు. పోలీసులు మానవతా దృక్ఫథంతో ఆలోచించి వరదయ్య కుటుంబానికి న్యాయం చేయాల్సి ఉంది.
FIR కాపీ కోసం దిగువ చూడండి

.