తీన్ దివారే, డోర్, ఇక్బాల్ లాంటి అద్భుత సినిమాలు తీసిన దర్శకుడు నగేష్ కుకునూర్ తొలిసారిగా మాతృ భాష లో తీసిన గుడ్ లక్ సఖి సినిమా మీద పెద్ద అంచనాలు ఉన్నాయి.
జాతీయ అవార్డ్ పొందిన హీరోయిన్ కీకీర్తి సురేష్ నటిస్తుండటంతో ఆ సినిమా కోసం అందరూ ఆసక్తి గా ఎదురుచూశారు. అయితే సినీ ప్రేమికుల అంచనాలను అందుకోవడంలో గుడ్ లక్ సఖి పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి.
కథ విషయానికి వస్తే, సఖి (కీర్తి సురేష్) అనే ఒక కుగ్రామానికి చెందిన అమ్మాయికి ఏ సంబంధం వచ్చినా అబ్బాయి కి ప్రమాదం జరుగుతుంది. బ్యాడ్ లక్ సఖి అనే ముద్ర పడుతుంది ఆ అమ్మాయికి.
సైన్యం లో కల్నల్ గా పనిచేసిన జగపతి బాబు ఆ గ్రామానికి వచ్చి షూటింగ్ ఛాంపియన్స్ ను తయారు చేయాలనుకుంటాడు. సఖి బాల్య స్నేహితుడు గోలీ రాజు నాటకాలు వేస్తూ, ఆ ఊరు వచ్చి, సఖిని ప్రేమిస్తాడు. సఖిను మంచి షూటర్ గా చేయాలనే జగపతి బాబు ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కధాంశం.
ఆటలు ప్రధాన అంశంగా వచ్చిన గురు సినిమా తరహా సినిమా ఇది. అయితే కథనం భిన్నంగా ఉన్నా కథలో బలం లేకపోవడం వల్ల సినిమాకు పెద్ద స్కోప్ లేకుండా పోయింది. సంభాషణలు బావున్నా కథ లో ఎమోషనల్ డెప్త్ లేదు. కీర్తి సురేష్, జగపతి బాబు, ఆది పినిశెట్టి బాగా నటించినా మెలో డ్రామా ఎక్కువ అవడంతో అంతగా ఆకట్టుకోదు సినిమా.
శాంతం, స్థిరం, ఏకాగ్రత క్రీడాకారులకు అవసరం అనే డైలాగ్ బావుంది. కొన్ని సన్నివేశాలు బావున్నాయి.
దేవి శ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. ఫోటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కీర్తి సురేష్ నటన చాలా బావుంది. జగపతి బాబు పాత్ర స్ఫూర్తి కలిగించేదిగా ఉంది. ఈ సినిమాను ఒక సారి చూడవచ్చు.
.. రాజేంద్రప్రసాద రెడ్డి
సీనియర్ జర్నలిస్టు, విమర్శకులు

.