ఆయనకు పుట్టుకతో అవిటితనం. అంగ వైకల్యం లెక్క చేసుకోకుండా జీవన పోరాటం చేస్తున్నాడు. శివునికి పరమ భక్తుడు. అందుకే శివయ్య దర్శనం కోసం సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం వచ్చాడు. ఆలయ అధికారులు సరైన చక్రాల కుర్చీ సమకూర్చక పోవడంతో… లోపలికి వెళ్లి స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం దొరకలేదు.
ధ్వజస్తంభం వద్ద నుంచే తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చోటు చేసుకుంది. సదరు భక్తుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి చెందిన రమేష్ అనే ప్రత్యేక ప్రతిభావండుతుడు అక్కడ స్థానికంగా పురైచి మెడై అనే పత్రికలో ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. ఈయన శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం కోసం శ్రీకాళహస్తికి వచ్చాడు.
ఆలయం వద్దకు వెళ్ళి బ్యాటరీ కారులో మహద్వారం వరకు చేరాడు. అక్కడ నుంచి ఆలయం లోపలకు పోవడానికి ప్రత్యేక ప్రతిభావంతులకు వీల్ ఛైర్ అధికారులు సమకూర్చాల్సి ఉంది. అయితే ఆయనకు ఓ పాత వీల్ ఛైర్ ఇచ్చారు. దానికి స్టాండు విరిగి పోయి ఉంది. చక్రాలు సక్రమంగా లేవు. ఇలాంటి వీల్ ఛైర్ లో వెళ్లడం కష్టమని… అందుబాటులో ఉన్న మరో వీల్ ఛైర్ తనకు సమకూర్చాలని రమేష్ అధికారులకు విజ్ఞప్తి చేశాడు.
అయితే అక్కడ ఉన్న అధికారులు అందుకు అంగీకరించలేదు. రమేష్ ఎంత వేడుకున్న వారు కరుణించలేదు. చేసేదేమీ లేక సదరు భక్తుడు నిరాశతో ఆలయ మహద్వారం ముందు భాగాన ఉన్న ధ్వజస్తంభం వద్ద నుంచే వెనుదిరగాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ముక్కంటి ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తనకు శివయ్య దర్శనం దొరక లేదన్నారు. ఈ ఆలయంలో సామాన్య భక్తులకు ఓ మాదిరి.. ధనవంతులకు మరో విధంగా న్యాయం జరుగుతోందన్నారు.
భక్తులందరికీ సమన్యాయం జరిగే విధంగా దేవదాయశాఖ అధికారులు చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలయ అధికారులు ఇకనైనా స్పందించి అంగవైకల్యం గల భక్తుల కోసం సరైన వీల్ ఛైర్లు అందుబాటులో ఉంచాలని కూడా కోరారు.
.