శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గత నెల 23వ తేదీన ప్రారంభమైన లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమం గురువారం నాటితో ముగిసింది.
పది రోజుల పాటు జరిగిన ఈ అర్చనల్లో పలువురు భక్తులు పాల్గొన్నారు.
వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా ఈ అర్చనలు జరిగాయి. లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన ముంగిపును పురస్కరించుకుని ముక్కంటి ఆలయంలో శుక్రవారం ఉదయం 9గంటలకు శ్రీ స్వామి వారి ఆలయం ముందు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నారు.
అదేవిధంగా హోమం నిర్వహించి.. మహా పూర్ణాహుతి సమర్పించనున్నారు. ధూప, దీప నైవేద్యాలు, హారతి సమర్పించి.. ప్రధాన కలశాలను ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామి, అమ్మవార్లను కలశ జలాలతో అభిషేకించనున్నారు.
ఈ పూజల అనంతరం లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన నిర్మాల్యమును స్వర్ణముఖిపనదిలో నిమజ్జనం చేయనున్నారు. అనంతరం అంబారీ ఉత్సవం నిర్వహిస్తారు.
లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనకు విజయవంతం చేయడానికి సహకరించిన భక్తులకు, ఆలయ సిబ్బందికి ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు కృతజ్ఞతలు తెలియచేశారు.
.