మైనారిటీల మీద దాడులు బాధాకరమని ఆ విభాగం టీడీపీ నేతలు అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… “మదరసా అరబియా దారుల్ అమన్ ను రక్షించండి.. అవినీతి అధికారులను శిక్షించండి” అనే నినాదంతో మౌలానా ముస్తాక్ అహమ్మద్ గారి ఆధ్వర్యంలో నంద్యాలలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించిన తెలుగుదేశం మైనారిటీ నాయకులపై అధికార పార్టీ నేతల దాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగి పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు ఉద్దేశ్య పూర్వకంగా కక్ష సాధింపు ధోరణులకు పాల్పడుతున్నారన్నారు.
మదరసాలపై జరిగే దాడులు ఆపాలని వారు డిమాండు చేశారు. లేదంటే భవిష్యత్తులో తగిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వారు హెచ్చరించారు. రాష్ట్రంలోని వక్స్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని కోరారు.
అదేవిధంగా కర్నూలు జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించలేని అవినీతి అధికారి డీఎండబ్ల్యూవో మహబూబ్ బాషా ఆస్తులపై దర్యాప్తు జరిపి ఉద్యోగం నుండి తొలగించాలని మైనారిటీ నేతలు డిమాండు చేశారు.
ఈ కార్యక్రమంలో షాకీర్ అలీ, షఫీ, జిలానీబాషా ,బషీర్, ఖాదర్ బాషా, అస్మత్, ఖాదర్, కరీం, మీర్జా, లాల్ బాషా, రావన్ బాషా, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
.