ప్రభుత్వం అమరావతినే ఏకైక రాజధాని గా ప్రకటించాలని, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన అమరావతి రైతుల పాదయాత్ర చిత్తూరు జిల్లాలో జరుగుతున్నందున వారికి తమ సంపూర్ణ సంఘీభావం తెలుపుతామని నగరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో గాలి భానుప్రకాష్ తీర్మానం చేసారు.
నగరిలోని కస్తూరి కళ్యాణమండపంలో నగరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని ఉండాలనే ఉద్దేశ్యంతో నాటి ప్రభుత్వం అడగగానే సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను అమరావతి రైతులు ప్రభుత్వానికి ఇచ్చారన్నారు.
ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని అమరావతి కి మద్దతు పలికారని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరీట మూడు ముక్కలాటలు ఆడుతున్నారని విమర్శించారు.
రాజధాని అమరావతి రైతులను రోడ్డున పడేసిందని వాపోయారు. న్యాయస్థానాలలో సైతం అమరావతి కి మద్దతు పలికేలా ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ చేసుకున్నట్లు నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు.
నేడు రైతులు పాదయాత్ర గా న్యాయస్థానం నుంచి మొదలై ఎన్నో ఆటంకాలు దాటుకుని చిత్తూరు జిల్లాకు చేరుకున్నారని వారికి మద్దతు పలకడానికి అందరూ పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అమరావతి రాజధాని ని నిర్మించడం చేతగాక మూడు రాజధానుల పేరుతో ప్రజలని మోసం చేస్తూ 3 సంవత్సరాలు గడిపేసారని తెలిపారు..
వైసీపీ తప్ప అన్నీ రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.. ఇప్పటికైనా వైసీపీ రైతుల ను అవమానిస్తూ, ఇబ్బంది కల్గిస్తే ప్రజలు హర్షించరు, చరిత్ర హీనులవుతారు..
.