టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక విప్లవం మన జీవితాల్లో చాలా చాలా మార్పులు తీసుకువచ్చాయి. అయితే.. ఈ సాంకేతికత వెర్రితలలు వేసి.. మన జీవితాలు సర్వనాశనం కావడానికి కారణం కాకూడదు. తమిళనాడులో మాత్రం అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటూ ఏమైనా చేయవచ్చునని అనుకున్న అతి తెలివితేటలు ఒక పసిబిడ్డను బలిగొన్నాయి.
తమిళనాడు నెమిలి అనే గ్రామానికి సమీపంలో లోకనాధన్, గోమతి దంపతులు. ఆమెకు ప్రసవం నొప్పులు ప్రారంభం కాగానే.. ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిన లోకనాధన్.. తానే ప్రసవం చేయడానికి పూనుకున్నాడు. అతడేమీ వైద్యుడు కాదు. కనీసం ప్రసవం చేయించే పరిజ్ఞానం ఉన్నవాడు కూడా కాదు. యూట్యూబ్ వీడియో చూస్తూ భార్యకు పురుడుపోవచ్చునని అనుకున్నాడు. తన చెల్లెలి సాయం తీసుకుంటూ.. యూట్యూబ్ చూస్తే ఆమెకు ప్రసవం చేశాడు.
తీరా.. గోమతి కడుపులో కవలపిల్లలు ఉన్నారు. పుట్టిన వారిలో మగబిడ్డ అప్పుడే చనిపోయాడు. ఆడబిడ్డ పరిస్థితి కూడా ప్రమాదకరంగానే ఉంది. ఇద్దరు బిడ్డలను ప్రసవించిన తల్లి పరిస్థితి కూడా ప్రమాదకరంగానే ఉంది. వారిద్దరినీ ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించారు.
ఏమిటీ పిచ్చి..?
యూట్యూబ్.. నవతరం మానవాళికి అందివచ్చిన ఒక అద్భుతమైనఅస్త్రం. ఏ విషయాన్నయినా సరే.. యూట్యూబ్ చూసి మనం నేర్చుకోవచ్చు. కేవలం యూట్యూబ్ చూసి పాఠాలు నేర్చుకుంటున్న వారు, పనులు నేర్చుకుంటున్న వారు, సాఫ్ట్వేర్ లు నేర్చుకుంటున్న వాళ్లు అనేకులు ఉన్నారు. వంటల విషయం అయితే చెప్పనక్కర్లేదు. తెలుగులోనే కొన్ని వందల వేల వంటల ఛానెల్స్ వర్ధిల్లుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటివి యూట్యూబ్ చూసి నేర్చుకుంటే తప్పులేదు. అలా నేర్చుకునే తత్వం మంచిది కూడా.
కానీ ఈ లోకనాధన్ చేసిన పని యూట్యూబ్ పిచ్చికి పరాకాష్ట. యూట్యూబ్ చూస్తూ ప్రసవం చేసేయగలను అనుకుని.. భార్యాబిడ్డల ప్రాణాలనే పణంగా పెట్టాడు ఈ మూర్ఖుడు. దానికి అతడి చెల్లెలి కూడా సహకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి మూర్ఖుల వల్ల మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? తరుణోపాయాలు కూడా తోచని దుర్మార్గమైన ఘటన ఇది.
ఇలాంటి వీడియోలను యూట్యూబ్ లో పెట్టకూడదు అని చెప్పలేం. ఎందుకంటే.. ప్రసవానికి సంబంధించిన వీడియో చూసి.. ఆ పరిజ్ఞానాన్ని సంపాదించుకునే వారు బోలెడు మంది ఉంటారు. అప్పటికీ.. అభ్యంతరకరమైన అనేక తరహాలకు చెందిన వీడియోల విషయంలో యూట్యూబ్ చాలా సమర్థనీయమైన ప్రమాణాలను పాటిస్తోంది. చాలా నియంత్రణ చూపుతోంది. ఇలాంటి విపరిణామాలకు వ్యక్తులే కారణం తప్ప.. యూట్యూబ్ ను నిందించి లాభం లేదు. ఈ ఘటనను నిత్యం గుర్తుతెచ్చుకుంటూ, ప్రాణాలతో చెలగాటం ఆడే పనులను యూట్యూబ్ పాఠాలద్వారా నేర్చుకునే దుస్సాహసానికి మరెవ్వరూ తెగబడకుండా ఉండాలి.
.