పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మృతులన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. జంగారెడ్డిగూడం ఘటనను నిరసిస్తూ ఆదివారం శ్రీకాళహస్తిలో టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారన్నారు. అయితే అందుకు విరుద్దంగా జే –బ్రాండ్లు తయారు చేయడంతో పాటు.. మద్యం ధరలు పెంచడం వలన మద్యపాన ప్రియులు విధిలేని పరిస్థితిలో సారా తాగుతున్నారని ఆయన చెప్పారు.
కల్తీ సారా తాగడం వలన జంగారెడ్డిగూడెంలో 25మంది మృత్యువాత పడ్డారని ఆయన తెలిపారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుధీర్ రెడ్డి డిమాండు చేశారు. సారా త్రాగి మరణిస్తున్నా.. మృతి చెందిన వారి కుటుంబాల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.
ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేదం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు పెంచి అక్క చెల్లెమ్మల పసుపు, కుంకుమలు తుడిపేస్తున్నారని ధ్వజమెత్తారు.
మద్యం ధరలు పెంచడం తో మద్యం కొనలేక సారాత్రాగి మరణిస్తున్నారన్నారు. ప్రభుత్వం మద్యం ఆదాయం కోసం తీసుకుంటున్న చర్యల మూలంగా గ్రామాల్లో నాటుసారా ఏరులైపారుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న సారా మరణాలకు బాధ్యత వహించడంతో పాటు.. మద్యపాన నిషేధ హామీని విస్మరించినందుకు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేశారు.
సారా తాగి మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారాన్ని చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు విజయకుమార్, రెడ్డివారి గురవారెడ్డి, కంఠా రమేష్, చక్రాల ఉష, మిన్నల రవి. పోలూరు శ్రీనివాసులురెడ్డి, షాకీరాలీ, బషీర్, యాదగిరి, ప్రతాప్, సాగర్ కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
.