ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్లలోని కొండచరియలు విరిగిపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అలిపిరి, రెండవ ఘాట్ రోడ్‌లో కొండచరియలను ఢిల్లీ ఐఐటి నిపుణులు కె.ఎస్.రావు, చెన్నై ఐఐటి నిపుణులు ప్రసాద్, టిటిడి పూర్వపు చీఫ్ ఇంజినీర్ మరియు సాంకేతిక సలహాదారు రామచంద్రరెడ్డి బృందం గురువారం మధ్యాహ్నం పరిశీలించింది.
కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనల కోసం ఐఐటి నిపుణులను టిటిడి ఆహ్వానించింది. ఈ సందర్భంగా టిటిడి ఇంజినీరింగ్ అధికారులు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, గోడలు, కల్వర్టు తదితర ప్రాంతాలను ఐఐటి నిపుణులకు చూపించి వివరించారు.
ఈ సందర్భంగా ఐఐటి నిపుణులు కె.ఎస్.రావు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోని వివిధ కొండ ప్రాంతాల్లో ఘాట్ రోడ్లలో వర్షాలకు కొండచరియలు విరిగిపడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2017 వర్షాలకు దెబ్బతిన్న తిరుమల ఘాట్ రోడ్లలో మరమ్మత్తులకు ఈ టెక్నాలజీ ఉపయోగించిట్లు చెప్పారు.
ఇప్పటికే టిటిడి ఇంజినీరింగ్ విభాగం ఘాట్ రోడ్లకు ఇరువైపులా సున్నితమైన ప్రాంతాలను గుర్తించి బండరాళ్ళకు ఫెన్సీంగ్, రాక్ బోల్టింగ్, షాట్ క్రీటింగ్, బ్రస్ట్ వాల్స్ ఏర్పాటు చేసిందన్నారు. శేషాచల కొండల్లో, ఘాట్ రోడ్లలో వర్షపు నీరు నిలువకుండా వెళ్ళడానికి అదనపు కాలువలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రస్తుత వర్షాలకు విరిగిపడిన బండరాళ్ళు 30 నుండి 40 టన్నులు ఉంటాయని, ఇవి చాలా ఎత్తు నుండి పడటం వలన రోడ్లు, రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని గుర్తించామన్నారు. ప్రస్తుతానికి రెండవ ఘాట్ రోడ్డులో అక్కడక్కడ మరమ్మత్తులు చేసి లింక్ రోడ్డు ద్వారా మోకాళ్ళ మెట్టు చేరుకుని అక్కడి నుండి తిరుమలకు చేరుకోవచ్చన్నారు.
కొండచరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో టిటిడికి సమగ్ర నివేదిక అందిచనున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
.

Discussion about this post