ఎవరికి వారు ఆధిపత్యం ప్రదర్శించుకోవాలనే ఆరాటం. ఎవరికి వారు తమ నిర్ణయమే ఫైనల్ అనే భావన. ఎవరికి వారు.. రెండో వారితో సమన్వయం చేసుకోకుండా.. తమంత తాము ప్రకటనలు చేసేయడం.. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి.. ఈ తరహా ధోరణులతో వ్యవహరిస్తూ భక్తుల్ని అయోమయంలోకి నెడుతున్నారు.
రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి రోడ్డు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో.. వీరిద్దరి ప్రకటనలను చూసిన వారు.. అసలు తిరుమలకు రావాలో వద్దో.. పరిస్థితి ఏమిటో అర్థం కాక అయోమయంలో పడుతున్నారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. బుధవారం ఉదయం రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని చైర్మన్ పరిశీలించారు. ఘాట్ రోడ్డు భారీగా కోతకు గురవడంతో పాటు అక్కడ పరిస్థితులు చాలా భయానకంగా వుండడంతో తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని15 రోజుల పాటు వాయిదా వేసుకోమని విజ్ఞప్తి చేశారు. ప్రయాణం వాయిదా వేసుకోలేని భక్తులు తిరుమలకు వస్తే స్వామి వారి దర్శనం చేయిస్తామని చైర్మన్ చెప్పారు.
ఆన్లైన్లో దర్శనం టికెట్లు పొందిన భక్తులు తమ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఆరు నెలల్లోగా దర్శనం తేదీ మార్పు చేసుకోవచ్చునన్నారు. నడకదారిలో తిరుమలకు వెళ్ళే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా సుబ్బారెడ్డి చెప్పారు.
చైర్మన్ ప్రకటిన చేసిన తర్వాత 5గంటలకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అందుకు పూర్తి భిన్నంగా ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తిరుమలకు భక్తులు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవంటూ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుమల, తిరుపతి మధ్య 4,300 వాహనాలు రాకపోకలు సాగించాయంటూ ప్రకటనలో పేర్కొన్నారు.
టీటీడీ చైర్మన్,ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలతో శ్రీవారి భక్తులను అయోమయంలో పడేసారు. నిజానికి ఈవో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేదని అన్నప్పటికీ.. చాలా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తిరుమల రాక- పోక కూడా మొదటి ఘాట్ రోడ్డు ద్వారా మాత్రమే జరుగుతోంది. దీంతో ప్రయాణ సమయం ఎక్కువ కావడంతో పాటు, చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది.
.