జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం. రచయితగా, ప్రచురణకర్తగా ఆయనకు ఎదురైన స్వానుభవాలు ఈ Writer’s Blues. నలభైకి పైగా పుస్తకాలు తీసుకువచ్చిన వ్యక్తిగా.. ఆయన అనుభవాలను adarsini.com పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ వ్యాసపరంపరలో ఇది ఏడవది.
వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా యువతరం ఆదరణ ఉన్న వారిలో ఆకెళ్ల రాఘవేంద్ర ఒకరు. రచయితగా, పాత్రికేయుడుగా, సివిల్స్ కోచింగ్ బోధకుడుగా బహుముఖ అనుభవం ఉన్న రాఘవేంద్ర.. యువతకు స్ఫూర్తినిచ్చేలా రాసిన పుస్తకం ‘మీరు సామాన్యులు కారు’!
హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో 2000 ప్రాంతంలో ప్రతిఏటా బుక్ ఫెయిర్ నిర్వహిస్తుండేవారు. అదే క్యాంపస్‌లో రచన జర్నలిజం కాలేజీ కూడా ఉండేది. బుక్ ఫెయిర్ కు వచ్చిన మిత్రులు పనిలో పనిగా నా దగ్గరకూ వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్లేవారు.
విజేత కాంపిటీషన్స్ బండ్ల సాయిబాబు బుక్ ఫెయిర్ చూడటానికి వచ్చి నా దగ్గరకూ వచ్చారు. ఆయన ఒక్కడే రాకుండా మరొకాయనను కూడా వెంటబెట్టుకొచ్చారు.
‘‘ఈయన పేరు ఆకెళ్ల రాఘవేంద్ర’’ అంటూ పరిచయం చేశారు.
అప్పటికే ఆకెళ్ల రాఘవేంద్ర ఈనాడులో- పనిచేసి ఉన్నారు.
ఆకెళ్ల రాఘవేంద్ర లాల్చీ ప్యాంటుతో, చిరుగడ్డంతో, చలాకీతనంతో హుషారుగా కబుర్లు చెప్పడం బాగా నచ్చింది.
అలా మొదలైన పరిచయం మారాకులు తొడుగుతూ విస్తరించింది. సినిమా పరిశ్రమ వారితోనూ మరీ ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితోనూ ఆకెళ్ల రాఘవేంద్రకు సన్నిహితత్వం ఉంది.
also read : ఇది సర్కారీ దందా.. జగన్ వెనక్కి తగ్గాల్సిందేనా
ఒకసారి జర్నలిజం పి.జి. డిప్లమా విద్యార్ధుల కాంటాక్ట్ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా- సీతారామశాస్త్రి గారిని తీసుకురావడంలో ఆకెళ్ల ముఖ్య భూమిక పోషించాడు. ఆరోజున సిరివెన్నెలతో మా అబ్బాయి రఘువంశీతో సహా గడిపిన విలువైన సమయాన్ని, అర్థవంతమైన చర్చనూ ఎప్పటికీ మరవలేను. ఇదంతా ఆకెళ్ల ఔదార్యంతోనే సాధ్యపడింది.

ఆకెళ్ల రాఘవేంద్ర, తన అర్థాంగి మాధవిని కూడా వెంటబెట్టుకుని ఒకటిరెండు సార్లు మా ఇంటికి వచ్చి కబుర్లు కలబోసుకున్నారు. ఉత్కంఠభరితమైన వారి ప్రేమకథను ఎంతో ఆసక్తిగా చెప్తుంటే చెవులప్పగించి మా కుటుంబ సభ్యులమందరం విన్నాం.
శాస్త్రిగారి మీద ఉన్న గౌరవం, అభిమానంతో ఆకెళ్ల తన కూతురుకు సిరివెన్నెల అని పేరు పెట్టుకున్నారు. ఇలా మా స్నేహం కొనసాగుతున్నవేళ..
also read : ఇండిపెండెంట్ జర్నలిజం గాడితప్పుతోందా? : రామ్ బాణమ్
అది 2002 మే 27వ తేదీ మరో భాగస్వామితో కలిసి అశోక్ నగర్‌లో సివిల్స్ కోచింగ్ సెంటర్ ను ఆకెళ్ల నిర్వహిస్తుండేవారు. ఆరోజు రాత్రి 8 గంటలకు ఆకెళ్లకు ప్రమాదం జరిగింది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్‌తో ఆస్పత్రిలో చేరారు.
నేనూ, బండ్లసాయిబాబు గాంధీ నగర్‌లోని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వచ్చాం. రెక్కలు విప్పి సమున్నత గగనానికి ఎగరటానికి ఉద్యుక్తమైన ఓ విహంగాన్ని రాక్షసంగా రెక్కలు విరిచినట్లయింది. రాఘవేంద్రకు వచ్చిన కష్టానికి మేమంతా బాధపడ్డాం. ఓదార్చాం. అయితే తెప్పరిల్లవలసిందీ, తేరుకోవాల్సిందీ ఆయనే కదా!
ఒంటినిండా కట్లతోనే స్ట్రెచర్‌పై రైలులో అమలాపురం దగ్గరలోని సొంత ఊరు మురముళ్లకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఒకటి రెండు నెలల తర్వాత ఫోను చేశారు.
చాలావరకు కోలుకున్నానని, ఇంకా నడవలేకపోతున్నానని చెప్పారు.
also read : ఘంటసాల సొంత కథ- 4: సినీ ప్రస్థానం ఇలా..
కూచుని రాసే ఓపిక వచ్చిందని, ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యక్తిత్వ వికాస పుస్తకం రాయాలని ఉందని ఆకెళ్ల చెప్పారు.
మీ పబ్లికేషన్స్ తరపున ప్రచురించే అవకాశం ఉందా? అని అడిగారు.
పనిలో పనిగా పుస్తకం స్కీమును వివరంగా రాసి అధ్యాయాల శీర్షికలతో సహా వివరంగా పోస్టులో పంపారు. పుస్తకం పేరు కూడా ‘మీరు సామాన్యులు కారు’ అని ఆయనే సూచించారు.
రచయితగా ఆకెళ్ల రాఘవేంద్ర సామర్థ్యాలపై నాకు అప్పటికే నమ్మకం ఉంది. ఆయన రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకం అమ్ముడుపోతుందా? లేదా? అన్నదానికంటే ఇబ్బందుల్లో ఉన్న మిత్రుడికి నావంతు చేయూత నివ్వటం కనీస ధర్మంగా భావించాను.
వెంటనే అంగీకరిస్తూ రాయండి ప్రచురిద్దాం అని హామీ ఇచ్చాను.
తన మాట ప్రకారమే స్క్రిప్టు సిద్ధం చేసి పంపారు. రీడబిలిటీ ఉంది. యూత్‌ను ఇన్‌స్పైర్ చేస్తుందనిపించింది.
ఒక తెలుగు సినిమా దర్శకుడి గురించి ప్రస్తావన అనవసరమని చెప్తే, దానికి వెంటనే అంగీకరించి తొలగించారు. పూర్తిగా కోలుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఆకెళ్ల రాఘవేంద్ర ప్రూఫ్ రీడింగ్ చేసి ఇచ్చారు. రాయల్టీ కింద రూ. 5వేలు అందించాను. అదేమీ పెద్ద మొత్తం కాకపోయినా, ఎంతో కొంత వెసులుబాటు నిస్తుందనుకున్నాను.
2003లో వెలువడిన ‘మీరు సామాన్యులు కారు’ పుస్తకం సేల్స్ పరంగా పెద్ద ప్రోత్సాహం ఇవ్వలేదు. నెమ్మదిగా కాపీలు అమ్ముడయ్యాయి.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఆకెళ్ల రాఘవేంద్ర తన జీవితంలో తగిలిన ఎదురుదెబ్బను తట్టుకుని ఎదురొడ్డి నిలిచారు. సివిల్స్ ఎగ్జామ్స్‌ను తెలుగు లిటరేచర్ ఆప్షనల్‌ను ఎంచుకునే అభ్యర్థులకు సక్సెస్‌ఫుల్ గురువుగా ఎదిగారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కూడా రాణిస్తున్నారు. ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ తరపున యూత్ కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మీరు సామాన్యులు కారు రీ ప్రింట్ ను తాను ప్రచురించుకుంటానని ఆకెళ్ల అడిగితే అలాగేనని చెప్పాను. ఆయన ఆ పుస్తకాన్ని రెండుసార్లు ముద్రించారు. విద్యార్థి లోకంలో సంపాదించుకున్న పేరు పుస్తకం విక్రయాలకు ఉపకరించింది.
‘‘మానసికంగా, శారీరకంగా దెబ్బతిని ఉన్న ఆ రోజుల్లో మళ్లీ నన్ను నిలబెట్టటానికి, పుంజుకుని కొత్త ఉత్సాహంతో ముందుకు సాగటానికి ‘మీరు సామాన్యులు కారు’ పుస్తకం ప్రచురణ ద్వారా మీరందించిన మద్దతు మరవలేను’’ అంటారు ఆకెళ్ల రాఘవేంద్ర.
నేను ప్రచురించిన ఒక పుస్తకం వందలాదిమంది యువకులకు ప్రేరణ నివ్వడమేగాక ఆ రచయిత జీవితంలోనూ మరతుమన్న మరపురాని జ్ఞాపకంగా మిగలడానికి మించి పబ్లిషర్‌గా నేను కోరుకునేదేముంటుంది? ఆశించేదేముంటుంది?
స్వయంకృషితో ఎదిగిన ఆకెళ్ల రాఘవేంద్ర కూడా సామాన్యుడేమీ కాదు.
.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్

.

Discussion about this post