సంఘవిద్రోహక శక్తులు ఓ అతిథిగృహంపై దాడి చేశారు. అందులో ఉన్న శ్రీవారి భక్తులను బందీలుగా నిర్బంధించారు. సమాచారం గుప్పుమంది. భద్రతాదళాల ప్రత్యేక బృందం ఆక్టోపస్ రంగంలోకి దిగింది. ఆ అతిథి గృహంపై వ్యూహాత్మకంగా దాడి చేశారు. సంఘవిద్రోహక శక్తుల ఆటకట్టించారు. బందీలుగా ఉన్న భక్తులను క్షేమంగా విడిపించారు. అతి స్వల్ప వ్యవధిలోనే ఈ ఆపరేషన్ ముగిసిపోయింది..
… ఇదంతా జరిగిన మాట వాస్తవమే. కానీ.. వాస్తవంగా జరగలేదు. తికమక అక్కర్లేదు గానీ.. ఈ ఎపిసోడ్ ఆక్టోపస్ దళాల మాక్ డ్రిల్ లో భాగంగా జరిగింది. చాలా కాలం తర్వాత.. తిరుమలలో ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి.
తిరుమల తిరుపతి దేవస్థానముల ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్.పి సిహెచ్. వెంకట అప్పల నాయుడు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 1.00 గంట వరకు తిరుమలలోని ఒక విశ్రాంతి గృహం వద్ద ఆక్టోపస్ పోలీసు దళం, నిఘా మరియు భద్రత విభాగం, పోలీసు, సంబంధిత శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది.

తిరుమలలో తరచుగా ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించేవారు. కరోనా వ్యాధి కారణంగా కొద్ది కాలం దీన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం సదరు వ్యాధి తగ్గుముఖం పట్టినందున పునఃప్రారంభించారు.
సంఘ విద్రోహులు తిరుమలలోని ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానముల భద్రతా దళాలు సాధ్యమైనంత త్వరగా వారిపై ఎదురుదాడి చేసి, వారి చెరలో వున్న బందీలను సురక్షితంగా విడిపించి, స్వామి వారి భక్తులకు ఎలాంటి అపాయం జరగకుండా, టిటిడి ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడడం ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశ్యం.
ఆ విధంగా తిరుమలలోని ఒక విశ్రాంతి గృహంపై సంఘ విద్రోహులు దాడి చేసి అతిథులను బందీలుగా చేసినట్లు, సమాచారం అందిన వెంటనే తిరుమలలోని ఆక్టోపస్ పోలీసు దళం, స్థానిక నిఘా మరియు భద్రత విభాగం, పోలీసు మరియు ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో వెంటనే ఎదురుదాడి చేసి బందీలుగా వున్న అతిథులను ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా రక్షించి, విడిపించి వారి వద్ద నుండి మారణాయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీన పరుచుకోవడమైనది.
ఇప్పటి నుండి ఇటువంటి మాక్ డ్రిల్ లను తరచుగా నిర్వహించి తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా వుందో దుండగులకు ఒక హెచ్చరిక లాగా, స్వామి వారి భక్తులకు భరోసా లాగా సందేశం ఇవ్వడం జరుగుతుంది.
తిరుపతి లోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ తరహా మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది.
.
Discussion about this post