చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం సున్నపు హరిజనవాడలో గ్యాస్ సిలిండరు పేలి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సంఘటన బుధవారం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని సున్నపు హరిజనవాడకు చెందిన డి.నిర్మల(40) అనే మహిళ టిఫిన్ సెంటరు, చిన్న దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం దుకాణం తెరచి ఇడ్లీ, దోసెలు చేయడానికి ఉపక్రమించింది.
అయితే గ్యాస్ అయిపోవడంతో… ఈ నెల 3వ తేదీన తీసుకువచ్చిన సిలిండరుకు కనెక్షన్ ఇచ్చింది. అయితే ఏ కారణంగానో అది పని చేయలేదు. దీంతో తన దగ్గర ఉన్న మరో సిలిండరుకు కనెక్షన్ ఇచ్చింది.
ఆ తరువాత తన పనిలో నిమగ్నమైంది. ఇంతలో పక్కన పెట్టిన సిలిండరు పేలింది. ఈ ఘటనలో నిర్మలతో పాటు టిఫిన్ కోసం వచ్చిన సున్నపు హరిజనవాడకే చెందిన సుబ్బమ్మ(37) తీవ్రంగా గాయపడ్ఢారు.
వీరిని వెంటనే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతంరం వీరిని తిరుపతికి తరలించారు.
ఈ ఘటనలో సుమారు రూ.లక్ష విలువ చేసే ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
.