అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ 16 వ మహాసభలు జనవరి 7వ తేదీ నుండి హైదరాబాద్ నగరంలో జరగనున్నాయని ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తి రవి పేర్కొన్నారు.
మహాసభ వాల్‌పోస్టర్‌లను మంగళవారం ఉదయం తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న నరేంద్ర మోడీ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారని అన్నారు. యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు.
రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదన్నారు. ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో పూర్తిస్థాయిలో ఉద్యోగాలు ప్రకటించలేదని, దానిని రద్దు చేసి నూతన క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగాలు లేక యువకులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోతున్నారని చెప్పారు. నేడు యువకులు ఎదుర్కొంటున్న సమస్యలను, పాలక పక్షాలు తీసుకుంటున్న యువజన వ్యతిరేక విధానాలపై మహాసభల్లో సుదీర్ఘంగా చర్చిస్తామని తెలిపారు.
యువతకు న్యాయం జరిగేందుకు భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో యువజన సమాఖ్య రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు విశ్వనాధ్, నదియ, వెంకటేష్, చంద్ర శేకర్, బాలాజీ, అశోక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
.