జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ తన ఉద్యమస్వరూపం, క్రియాశీలత ఎలా ఉంటుందో ప్రభుత్వానికి రుచిచూపించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో.. తన శ్రేణుల ద్వారా విస్తృత అధ్యయనం చేయించిన పవన్ కల్యాణ్.. ఇవాళ శ్రమదానంతో కొన్ని ప్రాంతాల్లో తన పార్టీవారితో కలిసి రోడ్లు బాగుచేయడానికి నిశ్చయించారు. అయితే రాజమండ్రి విమానాశ్రయంలో దిగిన వెంటనే.. పవన్ కల్యాణ్ ను ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా అక్కడే నిర్బంధిస్తారని, అరెస్టు కూడా చేస్తారని తెలుస్తోంది.
శనివారం నాడు రాజమండ్రి, పుట్టపర్తి లలో రోడ్లు రిపేరు చేసే శ్రమదానం కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొనాల్సి ఉంది. ఆయన ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుని.. అక్కడి రోడ్ల కోసం శ్రమదానం చేస్తారు. ఆ తరువాత రాజమండ్రి నుంచి.. అనంతపురం జిల్లా పుట్టపర్తికి అదే ప్రత్యేకవిమానంలో చేరుకుంటారు. అక్కడ కూడా రోడ్ల రిపేరు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదీ ప్రకటించిన షెడ్యూలు.
అయితే.. పవన్ కల్యాణ్ ఎక్కడైతే పర్యటించాలని, శ్రమదానం ద్వారా రోడ్లు బాగు చేయాలని అనుకుంటున్నారో ఆయా ప్రాంతాల్లో ప్రభుతవం రేయింబవళ్లు యుద్ధప్రాతిపదికన రోడ్లను బాగుచేయించింది. ఈ విషయం పవన్ ఇప్పటికే ఎద్దేవా చేశారు కూడా. నేను వస్తున్నానని తెలియగానే హడావుడిగా రోడ్లు వేయిస్తున్నారు.. అయినా సరే.. ఎక్కడో ఒకచోట శ్రమదానంలో పాల్గొంటా అని ఆయన సవాలు విసిరారు. ఆమేరకు రాజమండ్రి, పుట్టపర్తి వెళ్లేలా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేశారు.
అయితే ప్రభుత్వం పవన్ కార్యక్రమాల సందర్భంగా ముందుగానే అప్రమత్తం అయింది. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల జనసేన నాయకుల్ని ముందుగానే హౌస్ అరెస్టు చేసి, ఇళ్లలోనే నిర్బంధించారు. పవన్ కల్యాణ్ ప్రకటించిన చోట కూడా రోడ్ల రిపేర్లు జరుగుతున్నాయి. హడావుడిగా.. రాత్రివేళ్లలో వాహనాల లైటింగ్ లోనే ప్రభుత్వం రోడ్ల రిపేరు పనులు చేయిస్తోంది.
ఇదంతా ఒకవైపు జరుగుతుండగా.. పవన్ కల్యాణ్ శనివారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి చేరుకోనున్నారు. అయితే ఆయన ప్రత్యేక విమానంలో అక్కడకు వచ్చిన తర్వాత.. విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకోవాలని, అక్కడే నిర్బంధించాలని పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల సమస్య మిషగా చూపి పవన్ ను నిర్బంధించే అవకాశం ఉంది. విమానాశ్రయం వద్ద పరిస్థితి విషమిస్తే.. గనుక.. పవన్ ను అక్కడే అరెస్టు కూడా చేస్తారని పలువురు అంచనా వేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా.. విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకుండా అరెస్టులు చేయడం కొత్తసంగతి కాదు. గతంలో విశాఖలో చంద్రబాబునాయుడుకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. నిజానికి ఇలాంటి పోకడలు చంద్రబాబు హయాంలోనే మొదలయ్యాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని కూడా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండానే తిప్పి పంపిన సంఘటనలున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అదే విధానాలను ఇప్పుడు మరికాస్త ఇంప్రొవైజ్డ్ వెర్షన్లుగా అమలు చేస్తోంది.
పవన్ ను రాజమండ్రి విమానాశ్రయంలోనే నిర్బంధించి.. అటునుంచి అటే వెనక్కు పంపుతారని సమాచారం. అదే జరిగితే గనుక.. షెడ్యూలు ప్రకారం అదే ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి ఆయన పుట్టపర్తి చేరుకున్నా సరే.. అక్కడ భిన్నమైన అనుభవాలేమీ ఎదురుకాకపోవచ్చు.
ఇవి కూడా చదవండి :
బద్వేలును వదిలించుకోవాలని మిత్రులిద్దరిలో ఆరాటం
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
పవన్ కల్యాణ్ నిర్బంధమే కాదు కదా.. అరెస్టు జరిగినా కూడా అది తమ పార్టీ మైలేజీకే ఉపయోగపడుతుందని జనసేన శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఆల్రెడీ.. హడావుడిగా ప్రభుత్వం రోడ్ల రిపేరు పనులు చేపడుతున్నప్పటికీ.. అదంతా పవన్ కల్యాణ్, జనసేన పుణ్యమే అని ప్రజలు భావిస్తున్నారని కూడా వారు సంతోషిస్తున్నారు. నిర్బంధం అరెస్టు కూడా జరిగితే.. పార్టీ మైలేజీ అమాంతం పెరిగిపోతుందని సంతోషిస్తున్నారు.
.