సకల చింతలు దూరమై… సకల సౌఖ్యాలు చేరువై… ప్రతిక్షణం ఒక వేడుకై… ప్రతి ఒక్కరూ సంతుష్టులై…సర్వులు పరమాత్ముని ఛత్రఛాయలో…సుఖ, శాంతులతో… వర్ధిల్లాలని కోరుకుంటూ… నూతన ఏడాది 2022కి స్వాగతం పలుకుదాం. కరోనా కష్టాలు… ప్రకృతి వైపరీత్యాలు… అనేక చేదు అనుభవాలను మిగిల్చిన 2021 ఏడాదికి వీడ్కోలు చెబుదాం. గత అనుభవాలను నెమరు వేసుకుంటూ మానవాళి అభివృద్ధి దిశలో పయనించడానికి కొత్త ఏడాదిలో నిరంతరం శ్రమిద్దాం. మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పడానికి కృషిచేద్దాం.
కాలచక్రం గిర్రున తిరుగుతోంది. మరో ఏడాది చరిత్రలోకి చేరింది. 2021 సంవత్సరం మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. 2020లో ప్రారంభమైన కరోనా కష్టాలు 2021లో కూడా కొనసాగాయి. రెండవ దశ తీవ్రత పెరగడంతో మన జిల్లాలో వందలాది మంది కొవిడ్ మహమ్మారికి బలయ్యారు. ఏడాది చివరలో ఈ వైరస్ ఉధృతి తగ్గినా… ఒమిక్రాన్ రూపంలో మరో కొత్త వేరియంట్ ప్రజలను భయపెడుతోంది. ఈ వేరియంట్ ఎంత మందిని బలి తీసుకుంటుందోననే భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. విదేశాల నుంచి మన జిల్లాకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒమిక్రాన్ ను నివారించడానికి వైద్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుండటం శుభ పరిణామం. ప్రజలు కూడా ఇందుకు సహకరిస్తే వీలైనంత వరకు ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
2021 ఏడాదిలో ప్రకృతి భీభత్సం సృష్టించింది. ప్రత్యేకంగా తూర్పు మండలాలపై ఈ ప్రభావం ఎక్కువ. ఈశాన్య రుతు పవనాలు, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండాలతో దాదాపు ఒకటన్నర నెల పాటు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఈ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. పలు చెరువులకు గండ్లు పడ్ఢాయి. రేణిగుంట, వడమాలపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం కూడా సంభవించింది. తిరుమల ఘాట్ రోడ్డులో ఎన్నడూ లేని విధంగా కొండచరియలు విరిగి పడటంతో శ్రీవారి దర్శనాలకు కూడా ఇబ్బందులు ఏర్ఫడ్డాయి. ఎన్నడూ లేని విధంగా తిరుపతి జలమయమైంది. నగరంలో వారం రోజులకు పైగా జనజీవనం స్తంభించి పోయింది.
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ తో పాటు… సర్పంచుల ఎన్నికల్లో సైతం వైసీపీదే పై చేయి అయింది. అత్యధిక భాగం ఏకగ్రీవాలే జరిగాయి. అధికార పార్టీ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించి…ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి పెద్ద అపనింద మూట కట్టుకుంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లను ప్రోత్సహించి అధికార పార్టీ అభాసు పాలైంది. కుప్పం పురపాలక ఎన్నికల్లో సైతం తిరుపతి ఉప ఎన్నికలాగే చేసి అధికారం చేజిక్కించుకున్నారు.
శ్రీకాళహస్తి విషయానికి వస్తే ఘనమైన చరిత్ర కలిగిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల మూత పడింది. ముక్కంటి ఆలయ అధికారుల నిర్ణయంతో శ్రీకాళహస్తి మంచి సాంకేతిక విద్యాసంస్థను కోల్పోవలసి వచ్చింది. శ్రీకాళహస్తి శాసనసభ్యులు భియ్యపు మధుసూదనరెడ్ఢి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ… అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. నవరత్నాలు తప్ప… ఓ ఒక్క అభివృద్ధి పని ఇక్కడ జరగలేదు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించినా… ప్రభుత్వ విధానాల వలన వాటి నిర్మాణంలో వేగం మందగించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 6వేలకు పైగా ఇళ్లు కేటాయించినా… ఇంతవరకు కనీసం ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ‘అందరికీ ఇళ్లు’ పథకం నిర్మించిన ఇళ్లను కూడా రాజకీయ కారణాలతో పేదలకు పంపిణీ చేయలేదు. ఇలా చేయడం వలన లబ్దిదారుల్లో బాగా అసంతృప్తి పెరిగింది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ గా సత్యవేడు మాజీ జడ్పీటీసీ బీరేంద్రవర్మను జూలైలో ప్రభుత్వం నియమించినా…. స్థానిక శాసనసభ్యులు భియ్యపు మధుసూదనరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఆ తరువాత ధర్మకర్తల మండలి నియామం మరుగన పడి పోయింది. మహాశివరాత్రి లోగా నైనా ధర్మకర్తల మండలిని నియమిస్తారో లేదో చెప్పలేని స్థితి ఏర్పడింది. ధర్మకర్తల మండలి లేక పోవడంతో ఆలయ పాలన గాడి తప్పిందనే విమర్శ బాగా ఉంది. దళారీ వ్యవస్థ కూడా బాగా పెరిగి పోయింది. ఆలయాన్ని కొంతమంది వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఇక ముక్కంటి ఆలయ మాస్టర్ ప్లాన్ కూడా అడుగు ముందుకు పడలేదు. మహాశివరాత్రి లోపే మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నందున… కొత్త సంవత్సరంలోనైనా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడితే బాగుంటుందని భక్తులు ఆశ పడుతున్నారు. ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు నిజాయితీగా పాలన చేస్తున్నప్పటికీ… ఆలయంలో కొందరి అధికారుల తీరువలన ఆయన కూడా నీలాపనిందలు మోయాల్సి వస్తోంది. ఆలయ పాలన వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరగడమే ఇందుకు కారణం. నూతన ఏడాదిలోనైనా ఆలయ ఈవో పెద్దిరాజు స్వత్రంత్ర నిర్ణయాలు తీసుకుని… పాలన చేయాలని అందరూ ఆశిస్తున్నారు.
శ్రీకాళహస్తిలో అత్యంత పవిత్రమైన స్వర్ణముఖి నదీ ప్రక్షాళన, సుందరీకరణ పనులు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఈ పనులకు తుడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఏ కారణాల వలనో ప్రస్తుతం వారు ముందుకు రావడం లేదు. ఫలితంగా పనులు ప్రారంభం కాలేదు. స్వర్ణముఖినది ప్రక్షాళన కోసం మురుగునీటి శుద్ధి ప్లాంటును నిర్మించడానికి ఘనంగా భూమి పూజ చేశారు. అయితే నేటికీ ఈ పనులు ప్రారంభం కాలేదు. స్వర్ణముఖినదిపై నిర్మించిన ఆనకట్ట ఆధునీకరణ పనులు కూడా ఒక కొలిక్కి రాలేదు. ఈ ఆనకట్టను ఆధునీకరిస్తే… శ్రీకాళహస్తిలో స్వర్ణముఖినదికి కొత్త కళ సంతరించుకుంటుంది. కొత్త ఏడాదిలోనైనా ఈ ఆశ నెరవేరుతుందని ఆశిద్దాం.
శ్రీకాళహస్తి పురపాలక సంఘం విషయానికి వస్తే… ఇక్కడ పుర ఎన్నికలు జరగలేదు. విలీన ప్రక్రియ విషయం హైకోర్టులో ఉన్నందున పుర ఎన్నికలు ఆగాయి. హైకోర్టు తీర్పు వెలువరిస్తే నూతన ఏడాదిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక పురపాలక సంఘంలో అభివృద్ధి పనులు విషయానికి వస్తే… ప్రత్యేకంగా చెప్పదగినవి ఏవీ లేవు. హిందూ శ్మశాన వాటిక నిర్మాణ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. పట్టణ శివారులో ఉన్న రాజీవ్ నగర్ లో మౌలిక వసతులు లేక అక్కడ నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మురికి వాడల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2021లో శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన అభివృద్ధి పనులు చెప్పకోదగినవి ఏవీ లేవు. అధికారులు అభివృద్ధిని కాగితాలలో చూపుతున్నారే తప్ప… ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇదే దుస్థితి. కొత్త సంవత్సరంలోనైనా ప్రజల కలలు … ఆశలు నెరవేర్చడానికి పాలకులు కృషి చేయాల్సి ఉంది. కొత్త సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని కోరుకుందాం.
.