చిత్తూరు జిల్లాలో వరద పరిస్థితి ఇబ్బంది కరంగా ఉందని అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ తోపాటు 104 కాల్ సెంటర్ కూడా వరద పరిస్థితులపై పనిచేయాలని జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్ ) సిహెచ్ శ్రీధర్ అన్నారు. గురువారం ఉదయం ఆయన కాల్ సెంటర్ ల పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో పనిచేయాల్సిన శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఇక్కడ పని చేయాలని, ఇప్పటికే కేటాయించిన కాల్ సెంటర్ ల తో పాటు 104 కాల్ సెంటర్ కూడా 24 గంటలు పనిచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
గత వారం రోజుల నుంచి కాల్ సెంటర్ పనిచేస్తోందని 104 కాల్ సెంటర్ కూడా ప్రస్తుతం దీనికి అనుసంధానం చేయడం జరిగిందని, సంబంధిత శాఖల వారు సమస్య వచ్చిన తరువాత సంబంధిత ఉద్యోగుల తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేసేలా కృషి చేయాలని అన్నారు.
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని కాపాడడం మన అందరి బాధ్యత అని ఆ బాధ్యతలను విస్మరించకుండా సక్రమంగా పని చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. జిల్లాలో వరద పరిస్థితి భారీ ఎత్తున ఉందని అదేవిధంగా మరో ఐదు రోజుల పాటు తిరిగి భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు మరింత పటిష్టవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, రోడ్లు, బాధితులకు అందుతున్న సహాయ సౌకర్యాలూ, సహాయ శిబిరాల వివరాలు, సహాయ శిబిరాలలో బాధితులకు అందుతున్న ఆహారం ఇతర సౌకర్యాల మీద దృష్టి పెట్టాలని, బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర వస్తువుల గురించి, ఇల్లు కోల్పోయిన వారికి పరిహారం గురించి సమాచారం ఎప్పటికప్పుడు సేకరిస్తుండాలని జె సి అన్నారు.
అత్యవసర సమయాలలో కాల్ సెంటర్ పని తీరు చాలా అవసరమని అని, కరోనా సమయంలో 104 కాల్ సెంటర్ అద్భుతంగా పని చేయడంవల్ల ఆ కాల్ సెంటర్ ను కూడా ఇప్పటివరకు పని చేస్తున్న కాల్ సెంటర్ ల తో అనుసంధానం చేయడం జరిగిందని, ప్రజలకు సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా అందరూ పనిచేయాలని అన్నారు.
అన్ని శాఖల వారు షిఫ్టు ల వారీగా 24 గంటలు ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. దీనికి సంబంధించి సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం కోసం సంప్రదించవలసిన అధికారుల ఫోన్ నెంబర్లను ఇవ్వడం జరుగుతుందని సమస్య వచ్చిన వెంటనే వారిని సంప్రదించి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు.
ఇప్పటివరకుపని చేస్తున్న కాల్ సెంటర్ నంబర్లు 08572 242777,08572 242753,9849907389 మరియ 104 నెంబర్ల ద్వారా ప్రజలు వరద కు సంబంధించి పైనెంబర్లను సంప్రదించి పరిష్కారం పొందవచ్చని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.
.